News

పుట్టపర్తి శిల్పారామంలో అమర జవాన్ మురళీ నాయక్‌ విగ్రహావిష్కరణ.

18views

పుట్టపర్తి: దేశ సరిహద్దుల రక్షణలో ప్రాణత్యాగం చేసిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన అమర జవాన్ మురళీ నాయక్ జ్ఞాపకార్థం పుట్టపర్తి శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఘనంగా ఆవిష్కరించారు.

విగ్రహావిష్కరణ అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు అమర జవాన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మురళీ నాయక్ దేశం కోసం చేసిన ప్రాణత్యాగాన్ని స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. 2025 మే 9న జమ్మూకశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ (LoC) వద్ద పాకిస్థాన్ బలగాల కాల్పులను ఎదుర్కొంటూ మురళీ నాయక్ అత్యున్నత త్యాగం చేశారని తెలిపారు. చిన్న వయస్సులోనే మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలను అర్పించడం వర్ణనాతీతమైన త్యాగమని అన్నారు. మురళీ నాయక్ ధైర్యసాహసాలు, దేశభక్తి శ్రీ సత్యసాయి జిల్లా యువతతో పాటు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ అమరత్వం అమూల్యమైనదని అన్నారు. సరిహద్దుల్లో సైనికులు అహర్నిశలు విధులు నిర్వర్తిస్తూ దేశాన్ని కాపాడుతున్నారని, వారి త్యాగాల వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జీవించగలుగుతున్నారని పేర్కొన్నారు. మురళీ నాయక్ వీరగాథను శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ఎస్పీ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ఆర్మీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అమర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అమర జవాన్ కుటుంబ సభ్యులతో అధికారులు మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు అమర వీరుడి విగ్రహానికి నివాళులర్పించి, ఆయన త్యాగాన్ని స్మరించుకున్నారు.