
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో లడ్డూల తయారీ కోసం పంపే నందిని నెయ్యి వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఎఫ్) నిర్ణయించింది. ప్రస్తుత ఒప్పందం ప్రకారం మూడు నెలల వరకు ప్రతినెలా 350 టన్నుల నెయ్యి తితిదేకు పంపాలని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ తెలిపారు. తర్వాత మరో ఆరు నెలల వరకు ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని నిర్ణయించామని, దీనిపై మరోసారి తితిదే యాజమాన్యంతో చర్చించి తీర్మానిస్తామన్నారు. నందిని నెయ్యికి డిమాండు ఉన్నందున ఇకపై తితిదేకు పంపే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మార్గమధ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహిస్తామని భీమానాయక్ తెలిపారు. తితిదే లడ్డూల్లో నెయ్యి కల్తీ వివాదం నేపథ్యంలో కర్ణాటక సర్కారు ప్రైవేటు సంస్థలు పంపిణీ చేసే నెయ్యి నాణ్యత పరీక్షించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రైవేటు సంస్థల నెయ్యిని పరీక్షించాలని భారతీయ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)కు సూచించింది. ఇప్పటికే రాష్ట్రంలోని దేవాదాయశాఖ పరిధిలోని దేవాలయాల్లో పంపిణీ చేసే ప్రసాదాలను పరీక్షించాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ప్రసాదాలు తయారుచేసే ముందుగానే నెయ్యిని పరీక్షించి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది.





