జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జరుపుతోన్న దాడులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముష్కర మూకల దాడుల్లో పెద్ద సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్నేళ్ల కిందట ఉగ్రవాదరహిత జోన్‌గా ప్రకటించిన జమ్మూలోనూ ఇటీవల వారి ఉనికి అలజడి రేపుతోంది. రాజౌరి, పూంచ్, రియాసి, కథువా జిల్లాలు తీవ్రవాదుల లక్ష్యాలుగా మారుతుండడంతో భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేపడతున్నాయి. పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు చొరబాటు దృష్ట్యా జమ్మూ ప్రాంతంలో భారీగా సైన్యాలను మోహరించి ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది.
ఉగ్రమూకల భరతం పట్టేందుకు దాదాపు 500 మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలను ఆ ప్రాంతంలో మోహరించినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఆ ప్రాంతంలోకి పాకిస్థాన్ నుంచి 50 నుంచి 55 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని పేర్కొన్నాయి. జమ్మూలో ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు పాక్ ప్రయత్నిస్తోంది, నిఘా వర్గాలు కూడా తమ చర్యలను వేగవంతం చేశాయని తెలిపాయి. ఉగ్రవాదులకు సహకారం అందించేవారిపై ప్రత్యేకంగా దృష్టిసారించామని వివరించాయి. పాక్ దుర్మార్గపు చర్యలను ఎదుర్కోవడానికి ఇప్పటికే 3,500 నుంచి 4,000 మంది భద్రతా దళాలను మోహరించామని అధికారులు వెల్లడించారు.