
అనంతపురం వేదికగా శనివారం ఉదయం పూరీ జగన్నాథ రథయాత్ర జరగనుంది. ఇస్కాన్ ఆధ్వర్యంలో వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ మేరకు ఇస్కాన్ అనంతపురం శాఖ చైర్మన్ దామోదర గౌరంగదాసు గురువారం వెల్లడించారు. ప్రపంచ శాంతిని సాధించే దిశగా ఇస్కాన్ భక్తిమార్గం పయనియస్తోందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. సమాజాన్ని అంతటినీ ఏకం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల పరంపర ద్వారా జ్ఞాన ప్రచారం, వసుదైక కుటంబ నిర్మాణమే ఇస్కాన్ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఈ క్రమంలో ఏటా అనంతపురంలో పూరీ జగన్నాథ రథయాత్రను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. గతంలో కంటే ఈసారి రెట్టింపు స్థాయిలో అనంత ఖ్యాతిని చాటేలా రథయాత్ర కొనసాగుతుందన్నారు. ఆధ్యాత్మిక వేడుకలో భాగస్వాములై ఇస్కాన్ ప్రత్యేకంగా అందజేస్తున్న శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు.
రథయాత్ర సాగుతుందిలా :
కళాజాత, ఆధ్యాత్మిక ప్రవచనాలు, వేద పఠనం నడుమ జగన్నాథ రథయాత్ర రెండు రోజుల పాటూ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందులో భాగంగా తొలిరోజు శనివారం మధ్యాహ్నం 4 గంటలకు అనంతపురంలోని కేఎస్‌ఆర్ కాలేజ్ సమీపంలో మహాఅభిషేకంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. అక్కడ నుంచి నగర పాలక సంస్థ కార్యాలయం, సుభాష్‌రోడ్, టవర్‌క్లాక్, రాజు రోడ్డు, శ్రీకంఠం సర్కిల్, తిలక్‌రోడ్, గాంధీబజార్, పాతూరు బసవన్నకట్ట మీదుగా మళ్లీ సప్తగిరి సర్కిల్ ఆపైన నేరుగా ఇస్కాన్ మందిరానికి రథయాత్ర చేరుకుంటుంది. ఇస్కాన్ జీబీసీ చైర్మన్ శ్రీమాన్ రేవంత్ రమణ్‌దాస్ ప్రభు విశిష్ట అతిథిగా విచ్చేసి రథయాత్రను ప్రారంభించనున్నారు. అలాగే కళాజాతను పలువురు ప్రజాప్రతినిధులు ఆరంభిస్తారు. ఆదివారం సాయంత్రం అనంతపురంలోని లలితకళాపరిషత్తులో శ్రీకృష్ణ, బలరామ, సుభద్రాదేవిల మహా అభిషేకం, పుష్పార్చన అనంతరం రేవంత్ రమణదాసు అనుగ్రహ భాషణం ఉంటుంది.





