
అన్నవరం సత్యదేవుని ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం అన్నవరం దేవస్థానం మరో రెండు కొత్త బస్సులను కొనుగోలు చేయనుంది. ఒక్కో బస్సులో 42 మంది కూర్చునేందుకు సీట్లు కలిగిన వీటి కోసం రూ.80 లక్షలు వెచ్చించనున్నట్టు దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్ తెలిపారు. అశోక్ లైలాండ్ కంపెనీకి చెందిన ఈ బస్సులు ఆగస్టు నెలాఖరుకు అందుబాటులోకి రానున్నాయి.
పెద్దసంఖ్యలో భక్తుల రాక
అన్నవరం దేవస్థానానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. పర్వదినాలలో 50 వేల నుంచి లక్ష మంది, సాధారణ రోజులలో పది వేల నుంచి 30 వేల వరకూ మంది వరకూ ఉంటారు. భక్తుల కోసం అన్నవరం దేవస్థానం ఏడు బస్సులను నడుపుతోంది. వాటిలో రెండు బస్సుల కండిషన్ అంతంత మాత్రంగా ఉంది. మిగిలిన వాటిలో మూడు బస్సులు రైల్వేస్టేషన్ నుంచి రత్నగిరికి, మిగిలిన రెండు బస్సులు కొండ దిగువ నుంచి రత్నగిరికి తిరుగుతాయి. అలాగే సుమారు వంద ఆటోలు రైల్వేస్టేషన్ నుంచి రత్నగిరి మధ్య రాకపోకలు సాగిస్తాయి.
దేవస్థానానికి ఆదాయం
ప్రధానంగా రైళల్లో అన్నవరం వచ్చిన భక్తులు దేవస్థానం బస్సులతో పాటు ఆటోల ద్వారా సత్యదేవుని ఆలయానికి చేరుకుంటారు. ఒక రైలులో వచ్చిన సుమారు 500 మంది అన్నవరం రైల్వేస్టేషన్‌లో దిగితే.. వారికి కేవలం మూడు దేవస్థానం బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. అలాగే దేవస్థానం బస్సులో రత్నగిరికి ఒక్క్కొరికీ రూ.20 టిక్కెట్ వసూలు చేస్తున్నారు. అదే ఆటోలలో అయితే ఒక్కొక్కరికీ రూ.50 చెల్లించాలి. ట్రాన్స్‌పోర్టు ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో దేవస్థానానికి రూ.1.76 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్త బస్సులను రైల్వేస్టేషన్ నుంచి రత్నగిరికి నడిపితే మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ఆగస్టు చివరకు అందుబాటులోకి..
రెండు కొత్త బస్సులను రూ.80 లక్షలతో కొనుగోలు చేస్తున్నాం. ఇవి ఆగస్టు నెలాఖరుకు భక్తులకు అందుబాటులోకి వస్తాయి. కొత్త బస్సులు వచ్చాక, తరచూ మరమ్మత్తులకు గురవుతున్న పాత బస్సులు రెండు విక్రయించే ఆలోచన ఉంది.– కె.రామచంద్రమోహన్,ఈఓ, అడిషనల్ కమిషనర్





