News

ఆవు పేడతో బయోఫ్యూయల్‌ తయారీ- దంపతుల వినూత్న ఆలోచన

6views

పర్యావరణ పరిరక్షణకు, నగరాల్లో చెత్త సమస్య పరిష్కారానికి ఉత్తర ప్రదేశ్​లోని గాజియాబాద్‌కు చెందిన సాటియం శ్రీవాస్తవ, అనన్య శ్రీవాస్తవ దంపతులు వినూత్న ఆలోచన చేశారు. గాజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో కలిసి ఈ దంపతులు ఆవు పేడను ప్రాసెస్ చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. గోశాలలు, డెయిరీల నుంచి సేకరించే ఆవు పేడను వీరు పరిశ్రమల్లో వాడే బొగ్గు, కట్టెలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే జీవ ఇంధనంగా మారుస్తున్నారు.

సమస్యే ఆ ఆలోచనకు బీజం
గ్రామీణ ప్రాంతాల్లో ఆవు పేడను ఎరువుగా, పిడకలుగా వాడుకోవడం సర్వసాధారణం. కానీ, పట్టణాల్లోని డెయిరీలు, గోశాలలు, ఇళ్లలో పశువుల పెంపకం పెరిగిన కొద్దీ వెలువడే వ్యర్థాల నిర్వహణ పెద్ద సవాలుగా మారుతోంది. చాలామంది డెయిరీ యజమానులు దాన్ని నేరుగా రోడ్ల మీదకో, డ్రైనేజీల్లోకో వదిలేస్తున్నారు. ఫలితంగా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని, తీవ్రమైన దుర్వాసన, పారిశుద్ధ్య లోపాలు తలెత్తుతున్నాయి. గాజియాబాద్‌ నగరంలోనూ ఇదే ప్రధాన సమస్యగా ఉండేది. దీనిపై దృష్టి పెట్టిన శ్రీవాస్తవ దంపతులు పశువుల వ్యర్థాలను కేవలం చెత్తగా చూడకుండా, దానితో పర్యావరణానికి మేలు చేసే ఇంధనాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. పట్టుదలతో వివిధ టెక్నాలజీలపై పరిశోధన చేసి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులను సంప్రదించి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.

పీపీపీ మోడల్‌
ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో అమలు చేయాలని నిర్ణయించారు. గాజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం భూమిని కేటాయించగా, సివిల్ కన్స్ట్రక్షన్, అత్యాధునిక యంత్రాల ఏర్పాటు, ప్రాసెసింగ్ మౌలిక వసతుల కల్పన వంటి బాధ్యతలను శ్రీవాస్తవ దంపతులు చూసుకున్నారు. కేవలం ప్లాంట్ పెట్టడమే కాకుండా నగరంలోని వివిధ గోశాలలు, డెయిరీల నుంచి వ్యర్థాలను సేకరించేందుకు ఒక పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రవాణా ఖర్చులు కూడా తామే భరిస్తూ డెయిరీ నిర్వాహకులకు పెద్ద ఊరటనిస్తున్నారు.

తయారీ ప్రక్రియ ఇలా
ప్లాంట్‌కు చేరిన ఆవు పేడను తొలుత ఒక పెద్ద గుంతలో నిల్వ చేస్తారు. ఆ తర్వాత తగిన మోతాదులో నీటిని కలిపి ఒక మిశ్రమంలా తయారు చేస్తారు. ప్రత్యేకమైన పైప్‌లైన్ల ద్వారా ఈ మిశ్రమాన్ని అత్యాధునిక ప్రాసెసింగ్ యంత్రాలకు పంపుతారు. అక్కడ పేడలోని తేమను పూర్తిగా తొలగించి, మెత్తటి పొడి రూపంలోకి మారుస్తారు. ఆ పొడిని కొంతకాలం ఎండలో ఉంచి, ఏ మాత్రం తేమ లేకుండా చేశాక పరిశ్రమలకు రవాణా చేస్తారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ రోజువారీగా దాదాపు 200 టన్నుల ఆవు పేడను సేకరిస్తుండగా దాని ద్వారా సుమారు 100 టన్నుల నాణ్యమైన బయోఫ్యూయల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిశ్రమల్లో బాయిలర్లు నడపడానికి వాడే బొగ్గు, కట్టెల దహనమే ఈ కాలుష్యానికి ప్రధాన కారణం. ఈ సమస్యకు చెక్ పెట్టేలా ఈ ప్లాంటులో తయారవుతున్న ఆవు పేడ బయోఫ్యూయల్‌ అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారుతోంది. పరిశ్రమలు సంప్రదాయ ఇంధనాలకు స్వస్తి చెప్పి, ఈ హరిత ఇంధనాన్ని వాడేలా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు, ప్రాసెసింగ్‌లో భాగంగా వేరుచేసిన నీటిని కూడా వృథాగా పోనివ్వకుండా, వ్యవసాయ పొలాలకు ఎరువుగా మళ్లిస్తున్నారు. ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.

అధికారుల ప్రశంసలు
ఈ ప్రాజెక్టుపై గాజియాబాద్ మేయర్ సునీతా దయాళ్, మున్సిపల్ కమిషనర్ విక్రమాదిత్య సింగ్ మాలిక్ హర్షం వ్యక్తం చేశారు. డెయిరీల నిర్వాహకులు పేడను నేరుగా డ్రైనేజీల్లోకి కొట్టేయడం వల్ల భారీగా నీటి వృథా జరగడంతో పాటు డ్రైనేజీలు బ్లాక్ అయ్యేవని వారు గుర్తుచేశారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు మున్సిపాలిటీ సహకరించందన్నారు. ఈ ఆవు పేడ ఆర్గానిక్ ప్రాసెసింగ్ ప్లాంట్ గాజియాబాద్ పారిశుద్ధ్యాన్ని, పర్యావరణ నిర్వహణను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని మున్సిపాలిటీ యంత్రాంగం భావిస్తోంది. అందుకే నగరంలోని ప్రతీ డెయిరీని ఈ నెట్‌వర్క్‌తో అనుసంధానించాలని, తద్వారా గాజియాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దాలని సమాలోచన చేస్తోంది.