News

శ్రీశైలంలో అనూహ్య పరిణామాలు

151views

శ్రీశైలం వివాదాస్పద ఈవో శ్రీరామచంద్రమూర్తి బదిలీతో సహా ఈ రోజు శ్రీశైలంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. శ్రీశైలం దేవస్థానం నిర్మించిన లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లో షాపుల కేటాయింపు కోసం దేవస్థానం వారు నిర్వహించ తలపెట్టిన వేలంలో పాల్గొనడానికి కొందరు ముస్లిం మతస్థులు దరఖాస్తు చేసుకోవడం, దానిపై హిందూ సంస్థలు అభ్యంతరం వెలిబుచ్చటం, స్థానిక భాజపా నాయకుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అరెస్టు వంటి పరిణామాల నేపధ్యంలో రాష్ట్రమంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని వుండడం తెలిసిందే.

ఈ కారణంగా 20/8/19 బుధవారం నాడు శ్రీశైలంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాలని హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. ఆది నుంచి ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తూ వచ్చిన శివశక్తి పీఠాధిపతి శివ స్వామిని 19/8/19 మధ్యాహ్నం శ్రీశైలంలో పోలీసులు అరెస్టు చేసి విజయవాడ తరలించినట్లుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని దాదాపు 200 మంది హిందూ సంస్థల కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంస్థలలో పని చేస్తున్న కీలకమైన కార్యకర్తలు పలువురిని పోలీసులు శ్రీశైలంలో హిందూ ధర్మ రక్షా సమితి తలపెట్టిన నిరసన ప్రదర్శనలో పాల్గొనవద్దని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.

ఈ పరిణామాలన్నిటి మధ్యా ఈ వివాదమంతటికీ కేంద్ర బిందువైన ఈవో శ్రీరామచంద్ర మూర్తిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం కొస మెరుపు. ఆయన స్థానేమరో అధికారిని నియమించనున్నారు. అంతే కాకుండా 16/8/19 న జరిగిన వేలాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్సినట్లుగా కూడా తెలుస్తోంది. ముందు ముందు ఏం జరుగనుందో చూడాలి.