
హిందువుల పవిత్ర పండుగ దీపావళికి శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. దీపావళిని ‘ఆనందపు ఈద్’గా అభివర్ణించడంపై బీజేపీ నాయకులతో పాటు ఏఐఎంఐఎం నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక హిందూ పండుగను మరో మతానికి చెందిన పండుగతో పోల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ఖర్గే వ్యాఖ్యలతో మొదలైన వివాదం
నవంబర్ 8న దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలోని ప్రధాన పండుగల్లో దీపావళి ఒకటని, ఈ పండుగ ప్రజలను ఏకం చేస్తుందని, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలుసుకునేందుకు మంచి అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “దీపావళి ఆనందపు పండుగ. ఇది ఆనందపు ఈద్” అని వ్యాఖ్యానించారు. దీపావళి వేడుకలు అనేక రోజుల పాటు కొనసాగుతాయని చెబుతూ, ప్రజలు శాంతిని పాటించాలని, అపార్థాలను తొలగించుకోవాలని, జాతీయ ఐక్యత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అయితే, దీపావళి శుభాకాంక్షల్లో ‘ఆనందపు ఈద్’ అనే పదాన్ని ఉపయోగించడంపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. హిందువులకు అత్యంత పవిత్రమైన దీపావళిని మరో మతానికి చెందిన పండుగతో పోల్చాల్సిన అవసరం ఏమిటని పలువురు ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు మరో ఉదాహరణ: బీజేపీ
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ తీవ్రంగా స్పందించారు. దీపావళి శుభాకాంక్షల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలను చొప్పిస్తోందని ఆరోపించారు.ఈ వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మం పట్ల అనుసరిస్తున్న వైఖరికి మరో ఉదాహరణ అని ఆయన విమర్శించారు. వడోదర ఎంపీ, భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు హేమాంగ్ జోషి సైతం ఖర్గే వ్యాఖ్యలను ప్రశ్నించారు. దీపావళిని ఈద్తో పోల్చడం వెనుక ఉన్న ఉద్దేశమేమిటని నిలదీశారు.
ఖర్గే వ్యాఖ్యలను తప్పుబట్టిన ఎంఐఎం నేత వారిస్ పఠాన్
ఈ వివాదంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేతలే కాకుండా, ఏఐఎంఐఎం అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ కూడా ఖర్గే వ్యాఖ్యలను తప్పుబట్టారు.ముస్లింలకు ఈద్ ఎంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగో, హిందువులకు దీపావళి కూడా అంతే ప్రత్యేకమైన పండుగ అని ఆయన పేర్కొన్నారు. దీపావళిని ‘ఆనందపు ఈద్’గా అభివర్ణించడం సరైన పోలిక కాదని, ఇది కేవలం రాజకీయ ప్రచారానికి ఉపయోగపడే వ్యాఖ్యగా ఆయన అభిప్రాయపడ్డారు.





