
కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ హిందూత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. “హిందూత్వం సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంది, కాబట్టి ప్రజలు దానికి దూరంగా ఉండాలి” అని పిలుపునిచ్చారు. హిందూత్వం వైపు వెళ్లే వారి మనస్సులలో, ఆలోచనలలో కేవలం ద్వేషమే నిండి ఉంటుందని వ్యాఖ్యానించారు. అసలైన సనాతన ధర్మానికి, హిందూత్వానికి చాలా తేడా ఉందన్న ఆయన, ప్రస్తుతం సనాతన ధర్మాన్ని హిందూత్వంగా తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు ఈ వ్యత్యాసాన్ని సరిగ్గా వివరించకపోతే, వారు హిందూత్వం వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
దిగ్విజయ్ సింగ్ ప్రస్తుతం ఉజ్జయినినుంచి అయోధ్య వరకు సుమారు 1,000 కిలోమీటర్ల మేర చేపట్టిన ‘సత్య సనాతన స్వాభిమాన్ యాత్ర’లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. యాత్ర తొలి దశ పూర్తి చేసుకుని ఆయన సొంత ఊరైన రాఘవ్గఢ్ (Raghogarh) చేరుకున్న సందర్భంలో, ఆయన కుమారుడు జైవర్ధన్ సింగ్ ఈ యాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం తన కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. సనాతన ధర్మం ప్రధాన సందేశం ‘వసుధైవ కుటుంబకం’ అని, అంటే ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం అని అర్థమని వివరించారు. కానీ కొందరు సనాతనాన్ని ద్వేషంతో, హిందూత్వంతో ముడిపెట్టి తప్పుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.





