NewsProgramms

చంద్రయాన్-2కు తన వేదగణిత పరిజ్ఞానంతో మార్గం సుగమం చేసిన స్వామీ నిశ్చలానంద నవంబరులో విజయవాడ రాక

112views

ది శంకరులచే ప్రారంభించబడిన నాలుగు ఆమ్నాయ పీఠాలలో ఒకటైన పూరీ శంకరాచార్య పీఠానికి చెందిన శ్రీ శ్రీ శ్రీ జగద్గురు నిశ్చలానంద సరస్వతీ స్వామీజీ ఈ ఏడాది నవంబరు నెలాఖరులో విజయవాడకు విచ్చేయనున్నారని కలకత్తా హైకోర్టు న్యాయవాది, జగద్గురు పూరీ శంకరాచార్యుల భక్తులు, దేశ విదేశాలలో స్వామి వారి పర్యటనలను పర్యవేక్షించే శ్రీ ప్రేం చంద్ ఝా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మ రక్షణకై నడుం బిగించిన స్వామి వారు నవ్యాంధ్రప్రదేశ్ కు విచ్చేయడం ఒక చారిత్రాత్మకమైన విషయమని, ఆ సందర్భంగా అమరావతి, గుంటూరు పరిసర ప్రాంతాలలో వేలాది హిందువులతో ధర్మ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నామని శ్రీ ఝా తెలిపారు.

పూజ్య స్వామీజీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ, నిర్వహణ కోసం జగద్గురు పూరీ శంకరాచార్య భక్తులు, వివిధ హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలతో ఆంధ్రప్రదేశ్ లో “జగద్గురు పూరీ శంకరాచార్య ఆహ్వాన సమితి” పేర ఒక కమిటీని వేయనున్నామని, స్వామివారి పర్యటన, ధార్మిక సమ్మేళనం నిర్వహణకు కావలసిన అన్ని ఏర్పాట్లను ఈ కమిటీయే పర్యవేక్షిస్తుందని శ్రీ ఝా తెలిపారు.

వారితోపాటు పూరీ శంకరాచార్యుల భక్తులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, దక్షిణ భారత దేశంలో ఆశ్రమ వ్యవహారాలను పర్యవేక్షించే హైదరాబాదు వాసి శ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ కూడా విచ్చేశారు. శ్రీ శర్మ మాట్లాడుతూ “సకల శాస్త్ర పారంగతులు, ముఖ్యంగా జ్యోతిషశాస్త్రము, వేద గణితములలో ఉద్దండ పండితులు, పరమ నిష్ఠా గారిష్టులు, నిత్య అధ్యయన శీలి అయిన జగద్గురు పూరీ శంకరాచార్యులు మన విజయవాడకు వేంచేయనుండడం మనందరి అదృష్టం” అని తెలిపారు. తన వేద గణిత పరిజ్ఞానంతో చంద్రయాన్, మంగళయాన్ వంటి అంతరిక్ష ప్రయోగాలకు సైతం తన తోడ్పాటునందించిన మహానుభావులు పూజ్య నిశ్చలానందులని శ్రీ శర్మ పేర్కొన్నారు. గణిత శాస్త్రంపై స్వామివారు వ్రాసిన సిద్ధాంత గ్రంధంపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పరిశోధనలు జరుగుతున్నాయని, అంత గొప్ప మేధో సంపన్నులు, తపస్వి అయిన పూజ్య నిశ్చలానందుల రాకతో తెలుగు నెల పావనమవనున్నదని, కనుక యావదాంధ్ర ప్రజలు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలు, పూరీ మఠం యొక్క భక్తులు పాల్గొన్నారు. స్వామి వారి రాక తమకు మహదానందాన్ని కలిగించే విషయమని, కనుక స్వామి వారి పర్యటన, ధార్మిక సమ్మేళన ఏర్పాట్లలో జగద్గురు పూరీ శంకరాచార్య ఆహ్వాన సమితికి తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని వారు పేర్కొన్నారు.