News

డిల్లీలోని గురు రవిదాస్ ఆలయం కూల్చివేతపై దేశవ్యాప్తంగా హిందువులలో వ్యక్తమవుతున్న ఆగ్రహం

423views

దేశ రాజధాని దిల్లీలోని తుగ్లకాబాద్‌లో 500 సంవత్సరాల నాటి శ్రీ గురు రవిదాస్‌ ఆలయాన్నిసుప్రీంకోర్టు తీర్పు మేరకు కూల్చివేశారు. న్యూ ధిల్లీలోని తుగ్లకాబాద్ లో కూల్చివేయబడిన ఆలయమున్న స్థలాన్ని క్రీ.శ. 1509లో సికిందర్ లోడి పరిపాలిస్తున్న సమయంలో హిందూ సాధువు గురు రవిదాస్ సందర్శించారని భక్తుల విశ్వాసం.

కాగా ఈ కూల్చివేతపై పంజాబ్‌లోని రవిదాసియా సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయం కూల్చివేతను నిరసిస్తూ పంజాబ్‌ వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. బంద్‌ ప్రకటించింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. పలు ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి.

గురుదాస్‌పూర్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్‌ విపుల్‌ ఉజ్వల్‌ తెలిపారు. ఈ మేరకు లూధియానాలోని పలు పాఠశాలలకు ముందుగానే సెలవు ప్రకటించారు. బంద్‌ కారణంగా నేడు జరగాల్సిన పది, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఈ మొత్తం వ్యవహారంలో డిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) వ్యవహరించిన తీరును బీజేపీ, ఆప్, కాంగ్రెస్ లు తప్పు పడుతున్నాయి. హిందువుల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు వెలువరిస్తున్న వరుస వివాదాస్పద తీర్పులపై హిందూ సంస్థలు విస్మయాన్ని వెలిబుచ్చుతున్నాయి.