News

సింహాచలం క్షేత్రం ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక

24views

సనాతన ధర్మ సంప్రదాయాలకు, భక్తి వైభవానికి ప్రతీకగా నిలిచిన సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రాన్ని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి భరత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఎంపీ శ్రీభరత్ వారికి సింహాచల క్షేత్రం యొక్క చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతను వివరించారు. ముఖ్యంగా ప్రతి ఏడాది నిర్వహించే గిరిప్రదక్షిణ మహోత్సవం గురించి ప్రస్తావిస్తూ, భక్తుల విశ్వాసాలకు ఈ క్షేత్రం కేంద్రబిందువుగా నిలుస్తోందని పేర్కొన్నారు.ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే పవిత్ర గిరిపౌర్ణమి గిరిప్రదక్షిణ ఈ ఏడాది జూలై 28న జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపారు. సింహాచలం కొండ చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల మేర సాగే ఈ ఆధ్యాత్మిక యాత్ర భక్తులకు అపూర్వమైన దైవానుభూతిని కలిగిస్తుందని అన్నారు.

దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ గిరిప్రదక్షిణలో పాల్గొని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. గిరిప్రదక్షిణ నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, రవాణా, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా దేవస్థానం సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించి గిరిప్రదక్షిణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.

సింహాచలం క్షేత్రం ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ మహోత్సవం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.