News

ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

27views

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో రాబోయే ఆధ్యాత్మిక, ధార్మిక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ వీకే శీనా నాయక్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేవస్థానం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, పరిపాలనా చర్యలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

జూన్ 17న ఉచిత సామూహిక అక్షరాభ్యాసాలు
ఈ నెల 17వ తేదీన మహా మండపంలో నిర్వహించనున్న ఉచిత సామూహిక అక్షరాభ్యాస మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఈవో సమీక్షించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, పూజా సామాగ్రి పంపిణీ, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

కృష్ణానదీ పుణ్యహారతులకు శాశ్వత మౌలిక వసతులు
ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ప్రతి వారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న పవిత్ర కృష్ణానదీ పుణ్యహారతులకు భక్తుల ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొన్న ఈవో, అక్కడ శాశ్వత ఘాట్ నిర్మాణంతో పాటు మౌలిక వసతులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.

ఆషాఢ సారె సమర్పణకు ప్రత్యేక ఏర్పాట్లు
జులై 15 నుండి ఆగస్టు 12 వరకు నెల రోజుల పాటు జరిగే ప్రతిష్టాత్మక ఆషాఢ సారె సమర్పణ మహోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు తదితర ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

జులై 27 నుండి శాఖంభరీ ఉత్సవాలు
జులై 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న శాఖంభరీ ఉత్సవాల ఏర్పాట్లపై కూడా సమగ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరించే విశిష్ట సంప్రదాయానికి అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని కలిగించేలా ప్రత్యేక అలంకరణలు చేపట్టాలని సూచించారు.

దేవస్థాన ప్రాశస్త్యానికి, ఆగమశాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా వైదిక, పరిపాలనా విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేసి అన్ని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈవో స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో స్థానాచార్యులు శ్రీ శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు శ్రీ కోట ప్రసాద్, శ్రీ శంకర శాండిల్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ కిషోర్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు శ్రీ కోటేశ్వరరావు, శ్రీమతి రమాదేవి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు శ్రీ చంద్రశేఖర్, శ్రీమతి సుధారాణి, శ్రీ ఎన్. రమేష్ బాబు, శ్రీ కె. గంగాధర్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.