
ద్వైపాక్షిక సంబంధాల క్షీణత మధ్య మాల్దీవులను సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో పూర్తిగా పర్యటకంపై ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైసల్ విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య బంధం చారిత్రకమైనదని గుర్తుచేశారు.
‘‘మనకు ఒక చరిత్ర ఉంది. కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం కూడా భారత్‌తో కలిసి పనిచేయాలనుకుంటోంది. మేం ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాం. మా ప్రజలతో పాటు ప్రభుత్వం భారతీయులకు ఘన స్వాగతం పలుకుతుంది. దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగం కావాలని పర్యటక మంత్రిగా భారతీయులను కోరుతున్నాను’’ అని పీటీఐ వీడియోస్‌కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైసల్ అన్నారు.
పర్యటకశాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో మే 4 నాటికి 43,991 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు. క్రితం ఏడాది జనవరి – ఏప్రిల్ మధ్య ఈ సంఖ్య 73,785గా ఉంది. ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని నివేదిక వెల్లడించింది. చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న ముయిజ్జు భారత దళాలను వెనక్కి పంపి కయ్యానికి కాలుదువ్వారు. అంతకుముందు మాల్దీవుల వ్యవహారాల్లో భారత్ జోక్యం ఎక్కువవుతోందంటూ ప్రచారం చేసి సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే.





