ArticlesNews

స్మరణతో దైవసన్నిధి సాధ్యం

279views

భాగవతంలో భగవంతుణ్ణి పొందటానికి సూచించిన నవవిధ భక్తి మార్గాల్లో స్మరణ ఒకటి. నిరంతర స్మరణతో దైవసన్నిధి సులభమవుతుంది. కానీ ఏకాగ్రతకు భంగం కలిగిస్తూ అనేక ఆలోచనలు వస్తుంటాయి. వాటిని లక్ష్యపెట్టకుంటే ఎలా వస్తాయో అలాగే వెళ్లిపోతాయి. సాధకులు మనోనిగ్రహాన్ని అలవరచుకోవాలి. సదా భగవన్నామస్మరణలో ధ్యాసపెడితే, ఇతర విషయాలమీదికి మనసు మళ్లినా మళ్లీ వెనక్కు వస్తుంది.

సామాన్యంగా మన దృష్టికోణమంతా ‘నేను, నాది, మీరు, మీది’ అనే విషయాల చుట్టూ తిరుగుతుంటుంది. సర్వత్రా భగవంతుడే నిండి ఉన్నాడనే జ్ఞానం కలిగిందంటే ఇక రెండో ఆలోచనకు అవకాశం లేదు. అప్పుడు ఏకాగ్రత సాధ్యమవుతుంది. మనిషి ఒంటరిగా ఉన్నా కూడా.. మానసికంగా అనేకులతో కూడి ఉంటాడు. ఆ ఊహలూ, ఆలోచనలను సైతం దైవంతో ముడిపెట్టుకుంటే- ఇక మనసు అంత త్వరగా ఇతర విషయాల జోలికి వెళ్లదు. భగవంతుడే సత్యం. మిగిలినదంతా మాయ- అని తెలుసుకోవటమే జ్ఞానం. ఈ స్థితికి రావాలంటే ఎంతో సాధన అవసరం. మనసును స్థిరపరచుకోవాలి. అప్పుడు ఏకాగ్రత కుదురుతుంది. దైవసన్నిధి లభిస్తుంది.