
తండ్రి, తాతలు జాతీయవాదులు కావడం వల్ల చిన్న నాడి నుండి కాంగ్రెస్ పార్టీ వారితో పరిచయం ఏర్పడింది. 1937లో తెన్నేటి విశ్వనాధంగారు అసెంబ్లీ ఎన్నికలలో నిలబడ్డారు. వారికి మద్దతుగా ప్రచారం చేయడానికి వసంతరావు బుచ్చిసుందరరావు పంతులు, మల్లెమడుగుల జగన్నాధరావు, కందాళ సర్వేశ్వరశాస్త్రి మున్నగువారు. శివాజీపాలెం రావడం వారికోసం బంధువులతో తనూ వెళ్లి జస్టిస్ పార్టీ రౌడీ ముఠాలను ఎదిరించి తెన్నేటివారి విజయానికి తనవంతు సేవను అందించారు.
పైడయ్య 1940 డిశంబర్ లో బ్రిటీష్ ఆర్మీలో చేరారు. బెంగుళూర్ లో ఒక ఏడాది ట్రైనింగ్ పొంది జూన్ 1941న కలకత్తా రేవుగుండా అల్లిపూర్ కేంప్ లో 8-6-1941 నాడు ఓడ ఎక్కి వారం రోజులు ప్రయాణం చేసి 16 జూన్ నాటికి మలయాలోని కొలంబియారేవు చేరారు. తర్వాత సింగపూర్ పట్నానికి రైలులో వెళ్ళారు. బ్రిటీష్ అధికారులు జపాన్ వారి రూప స్వభావాలను గూర్చి తెలిపేరు. సైనికులందరికీ గుర్తింపు కార్డులు యిచ్చారు. రెండు మాసాలు అక్కడ జపాన్ వారితో భీకరపోరాటం.
15-2-1942 నాడు యుద్ధరంగంలో జపాన్ వారికి దొరికిపోయారు. భారతీయ సైనికుల్ని జపాన్ వారు మిత్రులుగా భావించి స్వేచ్ఛగా విడిచేరు. అక్కడ అంతకుముందే భారతీయ జాతీయవాది రాసబిహారీబోసు బ్రిటీష్ వారి అన్యాయాలను ఖండిస్తూ భారత అనుకూల వాతావరణాన్ని ఏర్పరిచారు. జర్మనీకి మారువేషంలో వెళ్ళిపోయిన సుభాస్ చంద్రబోసును జపాన్ కు ఆహ్వానించారు యీ రాసబిహారీ బోసు.
సుభాస్-1948 ఏప్రిల్ లో టోక్యో చేరుకున్నాడు. ఉన్నతాధికారులు బోసుకు మంచి స్వాగతం యిచ్చారు. I.N.A. ఏర్పాటయింది. బోసు ఉపన్యాసాలు భారతీయ వీరులలో నవోత్సాహం రేకెత్తించేయి, సైన్యానికి ధనం కావాలంటే ఎంతో డబ్బు కూడింది. “అజాద్ హింద్ ఫౌజ్”లో పీతల పైడయ్య ఆజాద్ బ్రిగేడర్ గా ఉండేవారు.
అజాద్ హింద్ సైన్యం 1944 జనవరిలో బ్రిటీష్ వార్ని ఎదుర్కోడానికి యుద్ధం ప్రారంభించింది. 1944 మార్చిలో జాతీయ సైన్యం కర్నల్ ఎ.ఇ.చటర్జీ గారిని భారతదేశ తాత్కాలిక గవర్నర్ నియమించింది. స్వంత కరెన్సీ తయారు చేయబడింది.
అయితే 1944 ఆగష్టు తర్వాత యుద్ధం ఆగిపోయింది. నేతాజీ జాడ తెలియలేదు. విమాన ప్రమాదంలో మరణించారని వార్తల కథలు వ్యాపించాయి. అజాద్ హింద్ ఫౌజ్ సైనికులను ఖైదీలుగా పట్టుకొన్నారు. నేర విచారణ చేసి చివరకు ఐ.ఎన్.ఎ. వారిని కట్టుబట్టలతో విడిచిపెట్టారు. భారతీయులు యీ జాతీయ సైనికులకు సంతోషంగా స్వాగతం చెప్పారు. పైడయ్య 10-6-1946లో విశాఖపట్నంకు చెందిన సింధియా కంపెనీలో (షిప్ యార్డ్) వెల్డర్ ఉద్యోగంలో చేరారు.
1980లో రిటైర్ అయ్యారు. 1971 శివాజీ నగర్ లో శ్రీ కృష్ణ సేవా సంఘం స్థాపించారు. దానికి గౌరవాధ్యక్షులు వీరు. ఉద్యోగ విరమణ నాటి నుండి ప్రజా సేవా రంగంలో – జిల్లా వెనుకబడిన ప్రజల మేలుకై పాటుపడుతున్నారు.
1989 రిపబ్లిక్ డే నాడు షిప్ యార్డ్ తరపున చైర్మన్ గారు పైడయ్య గారి చోడిపిల్లి సూర్యనారాయణ గార్ని, తెప్పల నారాయణ గార్నీ శాలువలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.





