ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో నేతాజీ వెంట నడిచిన ఆంధ్రులు 64 ; గోపరాజు వెంకట అనంత శర్మ

333views

ఆంధ్రప్రదేశ్ లోని, పశ్చిమ గోదావరి జిల్లా, ఆలమూరు గ్రామానికి చెందిన గోపరాజు శర్మ 1941లో “బ్రిటీషు ఇండియన్ ఆర్మీ”లో “అకౌంటెంటు” గా మొదటి ఉద్యోగావకాశం చేజిక్కించుకున్నారు.

బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో, రైఫిల్ షూటింగ్ శిక్షణ, ముగించిన తర్వాత, “మలేషియా” లోని “కోటాబారు” లో పోస్టింగ్ యిచ్చారు. అది రెండవ ప్రపంచ యుధ్ధం జరుగుతున్న సమయం. బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ, బ్రిటీష్ ఆర్మీతో కలసి, శత్రుదేశమైన జపాన్ మీద యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో జపాను గెలిచింది. అప్పుడు, ఈ బ్రిటీష్ ఆర్మీని, జపాన్ వారు, యుద్ధ ఖైదీలుగా ప్రకటించటం జరిగింది. అందులో అనంత శర్మ ఒకరు. వీరినందరిని, బ్యాంకాకు జైలులో, ఆరు నెలలు వుంచారు.

బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ నుంచి, బయటకు వచ్చి, ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA), అజాద్ హింద్ ఫౌజ్ లో చేరమని, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారు, పిలుపు నివ్వటం జరిగింది. దానికి చాలా ఆకర్షితులయిన అనంతశర్మ 1944 సంవత్సరంలో, బ్యాంకాకులో, “రత్నాకోసల్” హెూటల్ లో, “సుభాష్ చంద్రబోస్” గారిని స్వయంగా కలవగా వారిని “అజాద్ హింద్ ఫౌజ్” లో చేర్చుకున్నారు. శర్మగారికి, రైఫిల్ షూటింగ్ లో నైపుణ్యత వుందని తెలుసుకున్న నేతాజీ, ఆయనను తన “పర్సనల్ బాడీగార్డ్” గా నియమించారు.

సింగపూర్ లో ఆఫీసర్స్ ట్రైనింగ్ కోర్సు శిక్షణ, ఓ.టి.ఎస్. (O.T.S.)లో తీసుకొన్నాక, “2వ లెఫ్ట్ నెంటుగా”, రియర్, హెడ్ క్వార్టర్స్, సింగపూర్ లో బాధ్యతలు చేపట్టారు. “కమాండర్” గా, ఆర్మీ ఆఫీసర్ అయిన, కల్నల్, సి.జే. స్ట్రాసే గారి కింద బాధ్యతలు చేపట్టారు. రెండవ ప్రపంచ యుద్ధం అయ్యాక, విజయం సాధించిన, బ్రిటీష్ ఆర్మీ, అజాద్ హింద్ ఫౌజార్మీ వారిని యుద్ధఖైదీలుగా పట్టుకున్నా, ఇండియాలోని, ఫిరోజ్ పూర్ కంటోన్మెంటుకి, పంపారు.

శర్మగారు, ఎనిమిది నెలల, పదిహేడు రోజులు, యుద్ధఖైదిగా 06.09.1945 నుండి 23.05.1946 వరకు, సింగపూర్ మరియు ఇండియాలో జైలులో వారి జీవితం గడిపారు. ఐదు సంవత్సరముల తర్వాత యింటికి వచ్చిన వీరు ఆర్థికంగా చితికిపోయి, కట్టుబట్టలతో నిలబడవలసిన పరిస్థితి ఎదురుపడింది. జీవితపాఠాలే, వారిని, క్రుంగిపోకుండా నిలుపగా, సైన్యంలో చూపిన వీరత్వం, క్రమశిక్షణ, మళ్లీ ధైర్యంతో, తన మీద తనకున్న విశ్వాసాన్ని రెట్టింపు చేసుకొని, బ్రతుకుతెరువుకోసం. బ్రిటీషు వారినే తరిమికొట్టి స్వేచ్చావాయువు పీల్చుకుంటున్న తన దేశంలో ఎక్కడైనా, హాయిగా ఉద్యోగం తెచ్చుకోగలననే ఆత్మనిర్భరత గలవారు అవటం ఆయనకే చెల్లింది. ఆయన మీద ఆయనకు వున్న విశ్వాసమే, ఆయనకు, ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ దగ్గర ఉద్యోగం దొరికింది. ఆ తర్వాత, అకౌంటెంటుగా జార్జిటౌన్లోని, ఒక చార్టడ్ అకౌంట్స్ ఫరమ్ లో పనిచేయటం మొదలుపెట్టారు.

శర్మగారు ఒకసారి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారిని కలిసిన దరిమిలా వారి మార్గదర్శకంలో, 1947 సంవత్సరంలో, ఇండియన్ రైల్వేస్ లో టికెట్టు కలెక్టరుగా ఉద్యోగంలో చేరటం జరిగింది. “భారత ప్రభుత్వం, హోమ్ డిపార్ట్మెంటు”, స్వతంత్య్రపోరాటయోధులకి, ఇండియా కోసం, బయటనుండి పోరాడిన వారికి, పెన్షన్ అర్హత కల్పించటం జరిగింది. 23.05.1961 తేదిన, పెన్షనుకు అర్హతవున్న ఆర్డరును శర్మగారు, అందుకున్నారు. శర్మగారు, అప్పటికే, రైల్వేస్ లో విధులను నిర్వహిస్తున్న సమయంలో, ఆ పెన్షన్ తీసుకొనుట న్యాయం… ధర్మం కాదనుకొని, ఏ పని చేసిన నీతి, నిజాయితి వుండాలని, ఆ పెన్షన్ తను రైల్వేస్ సర్వీసులో వున్నన్నాళ్లు తీసుకోకూడదని నిర్ణయించుకోవటం గమనార్హం.

భారత ప్రభుత్వం ఆనాడు, స్వాతంత్య్ర సమరయోధులకు, భూమిని కేటాయించటం జరిగింది. వీరికి కూడా, తూర్పు గోదావరి జిల్లా, జేగురుపాడులో, 5 ఎకరాల వ్యవసాయ హమిని, ప్రకటించటం జరిగింది. శర్మగారు, బ్రతుకుటకు, కుటుంబ పోషణకు, “గవర్నమెంటు, రైల్వేస్ లో ఉద్యోగం యిచ్చిందని, ఆ ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయంతో, తన పిల్లల్ని చదివించుకోవటానికి, వారి బాగోగులకు సరిపోతుందని, వాళ్లకు చెప్పి, ఆ భూమి మరెవరికైనా అవసరమైన వారికి ఉపయోగపడవచ్చునని సున్నితంగా తిరస్కరించారు. ఉద్యోగం వున్నన్నాళ్లు జీతం, ఆ తర్వాత ఆయన అనుకున్న సిద్ధాంతాలకు లోబడి, తనకు వచ్చిన పెన్షన్లోనే జీవించిన వ్యక్తి గోపరాజు అనంతశర్మ.