
355views
వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం మందారం, ఎర్ర కలువ పుష్పాలతో అర్చన జరిగింది. ఉత్సవాలలో నాల్గో రోజైన శుక్రవారం అమ్మవారికి సమర్పించే పుష్పాలతో ఆలయ ఈవో కేఎస్ రామరావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఇతర ఆలయ అధికారులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పుష్పాలను తీసుకుని పుష్పార్చన వేదిక వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణ మధ్య అమ్మవారికి మందారం, ఎర్ర, తెలుపు కలువ పుష్పాలతో అర్చన నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు సాగిన పుష్పార్చనను భక్తులు, ఉభయదాతలు భక్తి శ్రద్ధలతో వీక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించారు. పుష్పార్చన నిర్వహించిన పూలను అర్చకులు భక్తులకు పంపిణీ చేయగా, పుష్పాల కోసం భక్తులు బారులు తీరి కనిపించారు.





