
365views
ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తితిదే ఈవో ఎ.వి.ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఒంటిమిట్ట పరిపాలన భవనంలో శుక్రవారం తితిదే, జిల్లా అధికారులతో సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ ఈ నెల 16న ఉత్సవాలకు అంకురార్పణ, 22న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు రాములోరి పరిణయ వేడుకలను నేత్రపర్వంగా నిర్వహిస్తామన్నారు. భక్తులు అసౌకర్యానికి గురికాకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. కలెక్టరు విజయరామరాజు మాట్లాడుతూ ఈ నెల 15 లోపు పనులన్నీ పూర్తి చేయాలన్నారు.పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డీపీవో ప్రభాకర్‌రెడ్డిని, విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ రమణను ఆదేశించారు.





