
స్వాతంత్ర్య సమరంలో పాల్గొని సాహసాలు ప్రదర్శించినా ఆ తర్వాతి కాలంలో ఎటువంటి ఆదరణకు నోచుకోక, అనామకులుగా కాలంచేసిన అనేకమంది వీరులలో ఒకరు తలిశెట్టి వెంకట చలపతి.
వెంకట చలపతి పుట్టింది శ్రీకాళహస్తి పట్టణంలో బహుదూర్ పేట ప్రాంతంలో చిన్నతనంలో ఆయనకు స్ఫూర్తి నిచ్చిన నాయకులు టంగుటూరి ప్రకాశం పంతులు. సైమన్ కమీషన్ కి వ్యతిరేకంగా చెన్నపట్నం వీధుల్లో ప్రకాశం ప్రదర్శించిన సాహసం దరిమిలా కలిసి ఆయనకు శిష్యుడు అయ్యాడు. గురువు ప్రకాశం చలపతికి యిచ్చిన ఆదేశం నీకు ప్రదేశంలో స్వాతంత్య్ర కాంక్ష ప్రజలలో పెంచమన్నది. అక్షరజ్ఞానం లేని సామాన్యులంతా ఉద్యమంలో భాగస్వాములైనపుడే ఆ ఉద్యమానికి గౌరవం, విలువ వస్తాయన్నది ప్రకాశం పంతులు భావన. అందుకే తన ప్రసంగాలన్ని సామాన్యులను ఉత్తేజ పరిచేలా చేసేవాడు. ఆ ప్రసంగాలను పట్టుకున్న తలిశెట్టి వెంకట చలపతి అదే ధోరణిలో ఇంటింటికి తిరిగి స్వాతంత్య్ర పోరాట వివరాలు చెపుతుండేవారు. చలపతి మృదుధోరణి ఎందరినో ఆకట్టుకుంది. ఆ విధంగా ఆయన మీద పోలీసు నిఘా మొదలైంది.
వయసు రక్తం ఉరకలు వేస్తున్నది. చలపతికి ఏదో ఒకటి చేసి ఉద్యమం ఉధృతం చేయాలన్నది కోరిక. స్వదేశీ ఉద్యమం పిలుపు వచ్చినపుడు కాళహస్తి పట్టణంలోని ప్రజలందరు విదేశీ వస్తు బహిష్కరణలో పాల్గొనేలా చేసాడు. విదేశీ వస్తువులను ముఖ్యంగా ఉన్ని బట్టలను తగలపెట్టించాడు. 1929లో మహాత్మాగాంధి శ్రీకాళహస్తి, మదనపల్లి, పుంగనూరు ప్రాంతాలలో పర్యటించి విదేశీ వస్తు బహిష్కరణ పిలుపునిచ్చినపుడు, పట్టణంలోని ప్రజలు వాడుతున్న విదేశీ దుస్తులు తీసుకుని స్వర్ణముఖి నదీ తీరానికి రప్పించాడు చలపతి. నది ఒడ్డున విదేశీ దుస్తుల దహన కార్యక్రమంతో పట్టణంలోకి స్వాతంత్య్ర ఉద్యమ వెలుగులను తీసుకువెళ్ళగలిగాడు.
1933 నుండి 1944 వరకు ఎంతో చురుకుగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న చలపతి, క్విట్ ఇండియా ఉద్యమం వేళ ఒక గొప్ప సాహసం చేశాడు.బ్రిటీష్ సైనికులను తరలిస్తున్న రైలును అక్కుర్తి రైల్వేస్టేషన్లో ధ్వంసం చేశాడు. బ్రిటీష్ సైనికులు భయపడి అటు ఇటు పరుగులు తీసారు. ఆనాటికి అదొక గొప్ప సాహసం. అయితే చలపతిని పోలీసులు పట్టుకుని, ఆయనకు మూడేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించారు. దానితో కాళహస్తి ప్రాంతంలో స్వాతంత్ర్య పోరాటం చప్పబడింది.
చలపతి సమసమాజం ఆశించాడు. కులభేదాలు తొలగి పోవాలని కోరుకొనేవాడు. హరిజనుల ఉన్నతి కోసం కృషిచేశాడు. గాంధీ నిర్వహించిన హరిజనుల దేవాలయ ప్రవేశానికి నడుం కట్టాడు. చిత్తూరు జిల్లాలోని ఆ ఉద్యమంలో భాగస్వామి అయ్యాడు.
స్వాతంత్య్రం సాధించిన తర్వాత చలపతి హరిజనులకు ఉపాధి కోసం, వారితో తాను కలిసి శ్రమ చేసేందుకు హరిజన సేవా సమితిని స్థాపించాడు. హరిజనుల కోసం ప్రత్యేకంగా ఒక తోలు పరిశ్రమను స్థాపించాడు. ఆర్ధిక ఇబ్బందులు వెంటాడాయి. బ్రతకటం కోసం చెన్నపట్నం చేరి టీచర్గా కొంతకాలం, నాటి మద్రాసు మేయర్ వెంకటస్వామి సెట్టికి వ్యక్తిగత కార్యదర్శిగా మరికొంత కాలం పనిచేసినా, తలిశెట్టి చలపతి ఆలోచనలు మాత్రం సామాజిక సేవ మీదే ఉండేది.
తిరిగి కాళహస్తి వచ్చి హరిజన విద్యార్థుల కోసం ఒక వసతిగృహాన్ని ప్రారంభించాడు. ఎందరో పేద, హరిజన విద్యార్థులు తలిశెట్టి చలపతి ఆదరణలో జీవితంలో ఎదిగారు. కాని చలపతి మాత్రం కొవ్వొత్తిలా కరిగిపోయాడు. ఇతరులకు దీపంలా వెలుగునివ్వటం తప్పించి, తన కోసం ఏమీ కోరుకోని, మిగుల్చుకోని తలిశెట్టి చలపతి 2002లో ఎవరూ గుర్తించని అనామకుడిగా కాలం చేశాడు. కాళహస్తిలో ‘తలిశెట్టి వారి వీధి’ అనేది మాత్రమే ఆ పోరాటవీరుడి జ్ఞాపికగా మిగిలింది.





