News

పుష్పగిరి క్షేత్రంలో వసతులలేమి

216views

వైఎస్ఆర్ జిల్లాలో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక నేపథ్యం, కలిగిన పుష్పగిరి చెన్నకేశవ క్షేత్రంలో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పుష్పగిరి కొండపై శివ, కేశవుల ఆలయాలున్నారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు మన రాష్ట్రం నుంచే కాక తెలంగాణ, తమిళనాడుతో పాటు కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు రాత్రి వేళల్లో బస చేసేందుకు విశ్రాంతి గదులు లేవు. స్నానాలు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్లు కూడా నిర్మించలేదు. ఆలయ ఆవరణలో కనీసం షెడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఎండలోనే వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది.

ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉండటంతో అభివృద్ధి చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. ఇదే కారణమైతే జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పురావస్తు శాఖ ఆధీనంలో ఉండే ఆలయాల్లో వసతులు ఎలా కల్పించారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో గుప్తునిధులు ఉన్నాయని గతంలో కొందరు దుండగులు పలు విగ్రహాలను ధ్వంసం చేశారు. చెన్నకేశవ స్వామి కొలువైన ప్రధాన ఆలయ ఆవరణలోనే కొలువైన ఉమామహేశ్వర స్వామి లింగాన్ని కూడా పెకలించి వేశారు. నేటికీ ఆ స్థానంలో స్వామి వారిని విగ్రహాన్ని పునఃప్రతిష్టించేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు ఆలయ భద్రత ముప్పుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. భక్తుల విరాళాలు, గుడి మాన్యాలు, పన్నుల పేరుతో రూ.లక్షల్లో ఆదాయం వస్తున్నా అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా దశాబ్దాలుగా భక్తులకు తిప్పలు తప్పడం లేదనే ఆందోళన నెలకొంది. ఈ విషయమై జిల్లా దేవదాయ శాఖ కమిషనర్‌ శంకర్‌ బాలాజీని వివరణ కోరగా.. ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉండటంతో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని స్పష్టం చేశారు.