News

దైవసన్నిధికి చేరుకున్న ‘పురుషోత్తమ భజన సామ్రాట్‌’ శాంతిలత బారిక్‌

97views

భోజి భోజి తు నామో చొక్కా నొయానో… మోరో జవు జీబొనో’ (పెద్దకళ్ల స్వామి నీ నామం గానం చేస్తూ నా ప్రాణవాయువు నీలో కలిసిపోనీ) అంటూ ఆలపించిన ఆ సుమధుర కంఠం మూగబోయింది. నిరంతరం తన కీర్తనలు ఆలపించిన ఆమె కోర్కె మేరకు జగన్నాథుడు తనలో ఆమెను లీనం చేసుకున్నాడు. ‘పురుషోత్తమ భజన సామ్రాట్‌’గా కోట్లాదిమంది ప్రజల హృదయాల్లో నిలిచిన శాంతిలత బారిక్‌ (65) ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కేన్సర్‌ వ్యాధితో బాధపడుతూ కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్న ఆమె మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.

ప్రజల్లో చెరగని ముద్ర
పూరీ జిల్లా నిమపడ సమితిలోని విష్ణుపురంలో 1958లో జన్మించిన శాంతిలత బాల్యంలో శాస్త్రీయ సంగీతం అభ్యసించారు. తర్వాత స్వగ్రామానికి చేరువలోని బ్రహ్మగిరికి చెందిన బసంత ఛట్రాయ్‌ను వివాహం చేసుకున్నారు. జగన్నాథుడ్ని ఆరాధించే ఆమె ఆ స్వామి కీర్తనలు ఆలపించి మధురగానంలో కోట్లాది ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. వందల సంఖ్యలో ఆమె ఆలపించిన పురుషోత్తమ గీతాలు ప్రతి ఇంటా మార్మోగుతూనే ఉన్నాయి. ఆమె ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. పూరీ శ్రీక్షేత్రంలో శాంతిలత భజనలు నిరంతరం వినిపిస్తుంటాయి. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో రథయాత్ర, ఇతర పర్వదినాల్లో ఆమె గానంతోపాటు ప్రవచనం ఆడియో, వీడియో క్యాసెట్లు ప్రతి ఇంటా ఉన్నాయి. తనగానం నల్లనయ్యకే అంకితమన్న ఆమెకు ఒడియా సినీ పరిశ్రమ నుంచి అవకాశాలు వచ్చినా సినీగీతాలు ఆలపించలేదు. శాంతిలత నోట సదాసర్వదా భక్తిరసం జాలువారింది.