
స్వాతంత్ర్యోద్యమంలో విద్యాధికులు, అగ్రవర్ణాల వారు జరిపిన పోరాటం అది. అందులో నిమ్నవర్గాలకు పాత్రలేదు అని స్వాతంత్ర పోరాట చరిత్రను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కొందరు చేశారు. నిజానికి ఆంధ్ర ప్రాంతంలో ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అన్ని వర్గాలది. ఉత్సాహవంతులు ఎవరైనా సరే చేయిచ్చి ఉద్యమంలో చేర్చుకున్నారు నాటి పోరాటవీరులు. నాటి సమాజం అంటరానివారుగా పిలిచిన వారిని ఆంధ్రదేశంలో ఆదుకుని, వారికి విద్యాబుద్ధులు నేర్పించి, హాస్టల్స్ నిర్వహించి ఉన్నత స్థానాలలో నిటబెట్టి సామాజిక సమరసతను సాధించటంలో కృషి సల్పిన వారున్నారు.వారిలో ఒకరు శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ.
శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారు జగమెరిగిన స్వాతంత్య సమర యోధులు, సంఘసంస్కర్త, ప్రగతిశీల రచయిత గాంధీ, తిలక్ ల స్వరాజ్యవాదమూ, వీరేశలింగం సంస్కరణాభిలాష, బిపిన్ చంద్రపాల్ గారి పోరాటదీక్షల నుండి స్పూర్తి పొందిన ఉన్నవ అలుపెరగని స్వతంత్ర సేనాని.
వీరేశలింగం గారిని గుంటూరు ఆహ్వానించి, వారి ఆధ్వర్యంలో మొదటి వితంతు వివాహాన్ని 1902, అక్టోబరు 11న చేయించారు. సంప్రదాయవాదులు ఉన్నవ దంపతులను వెలివేసినా ఆయన బెదరలేదు. తన సంస్కరణోద్యమాన్ని మరింత విస్తృత పరిచారు. పదిమంది వితంతువులకు వివాహాలు చేయించారు. తన యింటిని వితంతు శరణాలయంగా తయారుచేశారు. ఉన్నవ గారికి సంఘ సంస్కరణోద్యమం, జాతీయోద్యమం రెండూ రెండుకళ్ళు. ఏదీ ఎక్కువకాదు, ఏదీ తక్కువ కాదు. రాజకీయంగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేనిదే, సంఘసంస్కరణ సాధ్యం కాదని గ్రహించిన వారు, సంఘ సంస్కరణలు తీసుకొని రానిదే, రాజకీయ స్వాతంత్య్రం వలన పెద్దగా ప్రయోజనం ఉండదని కూడా తెలిసినవారు. అందుకే ఆయన రెంటికీ సమాన ప్రాధాన్యం యిచ్చారు.
ఒకవైపు స్వాతంత్యం కోసం పనిచేస్తూనే, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై కూడా ఉన్నవ ఉద్యమించారు. తెలుగువారు దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్నారు. తెలుగువారు అత్యధిక సంఖ్యలో నివసిస్తున్న ప్రాంతాలను కలిపి ‘విశాలాంధ్ర’ రాష్ట్ర ఏర్పాటుకై కూడా ఆయన ఉద్యమించారు. మద్రాసు, మైసూరు, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలలోని తెలుగు మాట్లాడేవారి ప్రాంతాలను కలుపుతూ విశాలాంధ్ర పటాన్ని తయారు చేశారు.
ఉన్నవ గారు సహాయనిరాకరణ ఉద్యమంలో భాగంగా న్యాయవాద వృత్తిని క్విట్ వదిలేసి, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆ సమయంలో పల్నాటి సీమలో ‘పుల్లరి’ అను దుర్భరమైన పన్నును తెల్లవారు నిరంకుశంగా వసూలు చేస్తున్నారు.ఉన్నవగారు, మాడభూషి వేదాంతం నరసింహాచార్యులతో కలసి మాచర్ల, గురజాలలో ‘పుల్లరి’ పన్నుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించారు.
కలెక్టరు విచారణ జరిపి ఉన్నవ గారికి సంవత్సరం జైలు శిక్ష విధించారు. తన జైలు జీవితాన్ని ఉన్నవగారు తన రచనావ్యాసంగంతో సుసంపన్నం చేసుకున్నారు. వాడుక భాషలో 762 పేజీల సుదీర్ఘ అద్భుత అభ్యుదయ రచనకు శ్రీకారంచుట్టారు. అదే ‘మాలపల్లి’ నవల. 1922లో ఆ నవలను రహస్యంగా ముద్రించి, ప్రచురించారు. ఆ నవలను ప్రభుత్వం నిషేధించింది. 1928లో కొన్ని భాగాలను తొలగించిన తర్వాత మాలపల్లి నవలపై నిషేధం తొలగించారు.
నిషేధం ఎత్తివేసిన తర్వాత కాశీనాథుని నాగేశ్వరరావు గారు నాల్గు భాగాలు కలిపి పూర్తి నవలగా ముద్రించటమే కాక ముందుమాట కూడా వ్రాశారు. మాలపల్లి నే నవల ఓ సంచలనం. ఆనాటి సామాజిక వ్యవస్థ గురించిన సహేతుకమైన -హై విమర్శతోపాటు ఆంగ్లేయులు నేరస్థ జాతుల చట్టం కింద రాత్రికి రాత్రే కొన్ని వేల మందిని వంశపారంపర్య నేరస్థులుగా ప్రకటించి, వారిని సెటిల్మెంట్లలో బంధించి, ” వారిని క్రైస్తవులుగా మార్చటానికి చేసిన యత్నాలను, అణచివేతను ఆయన లోకానికి డా తెలియచెప్పిన కారణంగానే ఆ నవల రెండుసార్లు నిషేధానికి లోనైంది.

1922 నవంబరు 22న గుంటూరులో ఆయన మహిళాభ్యుదయానికి శ్రీకారం చుట్టుతూ శ్రీశారదానికేతనను స్థాపించారు. కాకాని పురుషోత్తంగారి ఇంట్లో 10 మంది విద్యార్థినులతో నెలకొల్పిన శారదానికేతన్ ను కాశీనాథుని నాగేశ్వరరావుగారు ప్రారంభించారు. మహిళా సాధికారత ఆవశ్యకతను గుర్తెరిగిన ఉన్నవ దంపతులు 23 అనేకమంది నిరుపేద, నిస్సహాయ, దురదృష్ట యువతులకు ఆశ్రయం ఇచ్చారు. చదువు సంధ్యలు నేర్పారు. తమ కాళ్ళమీద తామే నిలబడటానికి కావలసిన శక్తి సామర్థ్యాలను సమకూర్చి పెట్టారు.
గాంధీ మహాత్ముని పిలుపు మేరకు 1930లో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం 70 వహించిన ఉన్నవ గారికి జైలు శిక్ష పడింది. ఆ తర్వాత వ్యక్తి సత్యాగ్రహంలోనూ, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ ఉన్నవగారు చురుకుగా పాల్గొని, గ్రామగ్రామానా తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేశారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో ఉన్నవ పాల్గొన్నారు. ఆ ఉద్యమం సందర్భంగా ఆగష్టు 12న గుంటూరులో ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు.
“ఒకవైపు తీవ్ర జాతీయభావం, మరోవైపు హైందవ సంస్కృతి పట్ల ప్రగాఢమైన అభినివేశం, ఇంకొక వైపున కుల మత వర్ణ విచక్షణకు తావు లేని అచలతత్త్వం పట్ల ఆసక్తి, ఆయనలో రాజకీయమూ, మతమూ పడుగుపేకల్లాగా పెనవేసుకుపొయ్యాయి.” దళిత జనాభ్యుదయం హైందవ తాత్వికతలో విడదీయరాని అంశంగా ఉన్నవ గారు ప్రతిపాదించి, మాలపల్లి నవలలో నిరూపించారు. హరిజనులకు భూములు పంచేటపుడు, ఇతర సదుపాయాలను అందించేటపుడు క్రైస్తవులు వాటిని తన్నుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.




