ArticlesNews

సమరసతా రవికిరణం శ్రీ సద్గురు మళయాళ స్వామి

45views

( మార్చి 29 – శ్రీ సద్గురు మళయాళ స్వామి జయంతి )

ఒకప్పుడు కులం పేరుతో సామాజిక అసమానతలు బలంగా ఉన్న కేరళ ముఖచిత్రాన్ని మార్చివేసిన ఘనత సద్గురు నారాయణ గురు, చట్టాంబి స్వామి వంటి ధార్మిక మహాపురుషులకు దక్కింది. అదే మార్గంలో తెలుగునాట సామాజిక, ధార్మిక సమానతను నిర్మించటంలో విశేషకృషి చేసినవారే సద్గురు మళయాళ స్వామివారు. కేరళలోని గురువాయూరు సమీపంలోని ఎన్గండ్యూరులో 29 మార్చి 1885లో కరియప్ప, నొట్టియమ్మ దంపతులకు మళయాళ స్వామిగా ప్రసిద్ధి చెందిన వేలప్ప జన్మించారు. చిన్నప్పటి నుంచే భగవత్ పూజ, భజన, ధ్యానం నిత్యకృత్యాలైనా ఆయన చదువులో ముందుండేవాడు.

శ్రీనారాయణ గురుదేవులు సామాజిక విప్లవకారులు. మానవులంతా ఒకే కులం, ఒకే జాతి అనే అభిప్రాయాలు కలవారు. ఆయన ప్రధాన శిష్యుడైన శివలింగ స్వామి వద్ద వేలప్ప శిష్యునిగా చేరాడు. ఆయన వద్ద మంత్రోపదేశం పొంది పతంజలి యోగ రహస్యాలను సాధన చేశాడు. అనంతర కాలంలో వేలప్పకు శ్రీనారాయణగురు దర్శనం కూడా లభించింది. దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలనూ సందర్శించాలని తన 20వ ఏట కాలినడకన బయల్దేరారు. అలా బ్రహ్మకపాల తీర్థం చేరినపుడు- ‘లోకంలో సమస్త ప్రాణులు పరబ్రహ్మగోత్రం నుండే ఉద్భవించాయి, నేను వదిలే తర్పణం ప్రాణికోటికంతటికీ చెందాలి’-అంటూ తర్పణం వదిలారు. తన పుణ్యక్షేత్ర సంద్శన యాత్రలో ఆయన చివరిగా తిరుమలలోని గోగర్భం చేరారు. అక్కడ 12 ఏళ్లపాటు కఠోర తపస్సు చేశారు. ఒక జిజ్ఞాసువు- ‘మీరు దేనికోసం తపస్సు చేస్తున్నారు?’ అని అడగ్గా, ‘ఈశ్వర దర్శనం కోసం తపస్సు చేయటం లేదు, ముక్తి పట్ల నాకు కోరిక లేదు, భగవంతుని పట్ల అవిచ్ఛిన్నమైన భక్తి ప్రజలందరకు కలగాలని తద్వారా అందరిలో అజ్ఞానం తొలగిపోయి సుఖం లభించాలని తపస్సు చేస్తున్నా.. ఈ పని సాధించటానికి నాకు పునర్జన్మ కావాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. ఇదే నా జీవితాశయం’ అని సమాధానం ఇచ్చారు.

తిరుమలలో 12 ఏళ్ల కఠోర తపస్సు అనంతరం మళయాళ స్వామి ఏర్పేడు దగ్గరి కాశీ బుగ్గలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆశ్రమం1926లో ప్రారంభమైంది. శ్రీ మళయాళస్వామి తన బోధనలతో, కృషితో చుట్టుప్రక్కల గ్రామాల్లో జంతుబలులను మాన్పించారు. 1926లో సనాతన “ధర్మపరిపాలన సేవా సమాజం”ను ప్రారంభించి వివిధ ప్రాంతాల్లో ధర్మప్రచార సభలు నిర్వహించారు. ఈ సభల ద్వారా వేల, లక్షల సంఖ్యలో ప్రజలు ఉత్తేజితులయ్యారు. 1928లో వేంకటేశ్వర సంస్కృతోన్నత పాఠశాలను ప్రారంభించారు. 1935లో కన్యాగురుకులాన్ని ప్రారంభించి అన్ని కులాల వారికీ సంస్కృతం నేర్పారు. 1937 నుండి, ‘ఓంకార సత్రయాగం’ పేరున ఓంకారోపాసనను అన్ని కులాలవారికి, స్త్రీలకు అందించారు. 1945 నుండి స్త్రీలకు కూడా సన్యాస దీక్షనీయడం ప్రారంభించారు. 1951లో రెండవ చతుర్మాసం గోదావరి తీరంలో జరిగినపుడు వేలసంఖ్యలో దళితులు వారి ప్రసంగాలు వినడానికి వచ్చారు.

శ్రీమళయాళస్వామి బ్రహ్మవిద్యా ప్రచారంతో పాటు, సంఘసంస్కరణకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. బ్రాహ్మణేతరులకు సన్యాసదీక్షనిచ్చి, వారిద్వారా మఠమందిరాలను ప్రారంభింపజేశారు. అస్పృశ్యతా నివారణ, వరకట్నాల నిషేధము, వితంతువులకు పునర్వివాహలు, శుభకార్యాల్లో ఆడంబరాల తొలగింపు ఇలా అనేక మంచి పరిణామాలకు కారణమయ్యారు. “యధార్ధభారతి” అనే పత్రికను నిర్వహించారు. వారు రచించిన ‘శుష్కవేదాంత తమోభాస్కరం’ అన్న గ్రంథమూ, వారు ప్రవచించిన ‘దయగల హృదయమే దైవమందిరము’ అనే సూక్తి విస్తృత ప్రచారం పొందాయి.

కేరళలో శ్రీ నారాయణగురు వలే అన్ని కులాలవారికీ, ప్రధానంగా నిమ్నకులాలవారిలో విద్యాబోధన, ధర్మప్రచారము, తాత్త్విక బోధనలద్వారా వారికి ఉన్నతిని కలుగ చేస్తూ సామాజిక వివక్షను రూపుమాపడానికి కృషి చేశారు. కోస్తాజిల్లాల్లోని ప్రజలపై స్వామిజీ, వారి ఆశ్రమాల ప్రభావం ఇప్పటికీ ఎంతో ఉంది. వారు జూలై 23, 1962న సమాధి పొందారు. గ్రామీణ ప్రాంతాల్లోని చదువురాని భక్తుల్లో హిందూధర్మం పట్ల అవగాహన కలిగించి, గీతా పారాయణ అభ్యాసం చేయించారు స్వామీజీ . దళితులకు సైతం పూజావిధానం, ఆచార వ్యవహారాలు, నియమ నిష్ఠలను అలవర్చిన ఘనత సద్గురు మలయాళ స్వాముల వారిదే. జనులందరిలో సమత్వ బుద్ధి సిద్ధించాలని, భగవంతుని ఆర్ధ్ర హృదయంతో వేడుకున్న స్వామీజీ ఆకాంక్షని మనందరం నెరవేర్చాలి.