బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే రిజర్వేషన్లు తొలిగిస్తుందని సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్న వీడియోపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పందించింది. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యతిరేకం కాదని పరమ పూజనీయ సర్ సంఘ్ చాలక్ డా.మోహన్ భాగవత్ గారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మోహన్ భగవత్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం రిజర్వేషన్లకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యతిరేకం అంటూ జరుగుతున్న అసత్య ప్రచారంపై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ తమపై తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ ఉపయోగించి తప్పుడు వీడియోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. సమాజంలో భేదభావాలు పోయే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సమాజంలో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాను మంచి కోసమే ఉపయోగించాలని హితవు పలికారు.
“రిజర్వేషన్లకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యతిరేకమని ఒక వీడియో వైరల్ అవుతోంది. రిజర్వేషన్లకు ఆర్.ఎస్.ఎస్. వ్యతిరేకం కాదు.అవసరం ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగాలి. ఏఐ ఉపయోగించి తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను మంచి కోసం వాడాలి.” – డా.మోహన్ భాగవత్, సర్ సంఘ్‌చాలక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్





