
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న లక్ష్మీనృసింహస్వామి వారి దివ్య రథోత్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. దివ్య మంగళ స్వరూపడైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో మంగళాద్రి కిటకిటలాడింది. ఆదివారం రాత్రి అంగరంగవైభవంగా కల్యాణమహోత్సవాన్ని నిర్వహించుకున్న స్వామి వారు సోమవారం ఉదయం బంగారు గరుడోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం బ్రాహ్మణ సమారాధనం అనంతరం మూడు గంటలకు ఉభవ దేవేరులతో స్వామి వారు దివ్య రథాన్ని అధిరోహించారు. అలంకరణ, పూజల అనంతరం 3 గంటల 35 నిముషాలకు స్వామి వారి దివ్య రథం భక్తుల గోవిందనామ్మస్మరణతో మారుమోగుతూ బయలుదేరగా జై నారసింహ..జైజై నారసింహ అనే నినాదాలతో మంగళాద్రి భక్తిపారవశ్యంతో పులకించిపోయింది.
గాలిగోపురం వద్ద హారతితో బయల్దేరిన రథోత్సవం మెయిన్‌బజార్‌లోని మిద్దె సెంటర్ ఆంజనేయస్వామి ఆలయం వరకు చేరుకుని అక్కడ పూజల అనంతరం తిరిగి అదే మెయిన్‌బజార్‌లో గాలిగోపురం వద్దకు చేరుకుంది. భక్తులు భారీగా తరలిరావడంతో పలురోడ్లు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ‘రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్వతే’ దక్షిణాభి ముఖముగా రథారూరుఢై పయనించి కేశవుని. శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించిన వారికి మరలజన్మ ఉండదని శాస్త్ర ప్రమాణం. కావున అత్యంత వైభవంగా జరుగు రథోత్సవంలో లక్షలాది భక్తులు పాల్గొని శ్రీస్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్సవ కైంకర్యపరులుగా మాఢభూషి వేదాంతచార్యులు వ్యవహరించగా ఆలయ ఈవో ఏ రామకోటిరెడ్డి ఉత్సవాన్ని ప్రారంభించి పర్యవేక్షించారు.





