News

అమరేశ్వరుని సన్నిధిలో ‘అమరేశ్వరం’ గ్రంథావిష్కరణ

250views

అమరేశ్వరాలయంపై భక్తుల హృదయాలలో కలిగే అనుమానాస్పద భావనలకు ‘అమరేశ్వరం’ గ్రంథం సంపూర్ణ సమాధానంగా నిలుస్తుందని అమరేశ్వరాలయ కార్యనిర్వహణాధికారి వేమూరి గోపీనాథశర్మ అన్నారు. సోమవారం రాత్రి అమరేశ్వరాలయంలో పాపయారాధ్య సాహితీ కేంద్రం ఆధ్వర్యంలో ధాన్యకటక విహార ట్రస్టు చైర్మన్‌ డాక్టర్‌ వావిలాల సుబ్బారావు రచించిన ‘అమరేశ్వరం’ పరిశోధనాత్మక గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జ్యోతిష్య విశారద శనగవరపు రామ్మోహనశర్మ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా గోపీనాథ శర్మ మాట్లాడుతూ అమరేశ్వరాలయ నిర్మాణ శైలిని, ఆనాటి ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలను పరిశోధన చేసి నేటి తరాలకు అందించే ప్రయత్నం చేసిన గ్రంథకర్త డాక్టర్‌ వావిలాల సుబ్బారావు సేవలు శ్లాఘనీయమని పేర్కొన్నారు. బౌద్ధ స్తూపం కూల్చి ఆలయం నిర్మించారనే కోట్లాది మంది ప్రజలలో నెలకొన్న అనుమానాలకు అమరేశ్వరాలయంలోని సుమారు 38 శాసనాలను నిరంతరం అధ్యయనం చేసి గ్రంథం ద్వారా తగిన వివరణ ఇచ్చారన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పరిశోధనాత్మక వివరణ ఇచ్చి భక్తుల నమ్మకాన్ని మరింత పెంచిన వావిలాల సుబ్బారావుకు దేవదాయ శాఖ, అమరేశ్వరాలయం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ సాహితీవేత్త ప్రపుల్లారాణి మాట్లాడుతూ డాక్టర్‌ సుబ్బారావు సుమారు 38 శాసనాలను అధ్యయనం చేసిన పిదప ఈ ఆలయానికి సుమారు వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు ప్రామాణికంగా నిరూపించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.