News

నేటి నుంచి మంగళగిరి శ్రీలక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు

196views

మంగళాద్రిలోని శ్రీలక్ష్మీనారసింహుడి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమైయ్యాయి. ఉదయం ఏడు గంటలకు స్వామిని పెండ్లి కుమారుడి వేడుకతో ఉత్సవం ప్రారంభమైంది. బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆదివారం రాత్రి ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణంతో ప్రారంభమై ప్రతి రోజు ఒక వాహనంపై భక్తులకు స్వామి వారు దర్శనమివ్వనున్నారు. సోమవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు హనుమంత వాహనం, మంగళవారం రాజ రాజాధి వాహనం, బుధవారం యాలి వాహనం, గురువారం సింహ వాహనం, శుక్రవారం ఉదయం హంస వాహనం, రాత్రి గజవాహనం, శనివారం ఉదయం కల్ప వృక్షవాహనం, రాత్రి పొన్న వాహనం, ఆదివారం ఉదయం ఆశ్వవాహనాలపై గ్రామోత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీవారు పురవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాలలో ముఖ్యంగా పొన్న వాహనం సేవ అత్యత ప్రధానమైనది.

25వ తేదీన రథోత్సవం
బ్రహ్మోత్సవాలలో ప్రధానఘట్టాలైన స్వామి కల్యాణం 24 వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు స్వామి వారి కల్యాణవేదిక మైదానంలో నిర్వహించనున్నారు. వేలాది భక్త జనసందోహం మధ్య స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. స్వామి వారు ఎదుర్కోల మహోత్సవం జరుపుకుని కల్యాణ వేదికపైకి చేరుకుని భక్తులకు దర్శనమిస్తారు. 25వ తేదీ సోమవారం ఉదయం బంగారు గరుడోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు స్వామి వారి దివ్యరథోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి భక్తులు భారీగా తరలిరానున్నారు.