News

భక్తులకు మెరుగైన సేవలందిస్తాం

233views

మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించినట్లు మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు అన్నారు. గురు వైభోత్సవాల్లో భాగంగా మంగళవారం భక్తులనుద్దేశించి పీఠాధిపతి మాట్లాడారు. మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్‌లోని ఆర్‌అండ్‌బీ నుంచి శ్రీమఠం వారు ఇటీవలే స్వాధీనం చేసుకున్న స్థలంలో తాను పీఠానికి వచ్చి 12 ఏళ్లు కావడంతో రూ.25 కోట్లతో 12 అంతస్థుల భవన నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు. ఈ నెల 16న రాఘవేంద్రస్వామి 429వ పుట్టిన రోజున భూమి పూజ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళిక, బ్లూప్రింట్‌ సిద్ధంగా ఉందన్నారు. పరిమళ ప్రసాద కౌంటర్లు, లాకర్లు, 400 గదులు, సేవా కౌంటర్లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు అందులో కల్పిస్తామన్నారు. అభయ శ్రీరామ ఏకశిల విగ్రహ సమీపంలో వందెకరాల్లో తుంగభద్ర నది నుంచి పంపింగ్‌ చేసి ఎస్‌ఎస్‌ ట్యాంకును నిర్మించి మంత్రాలయం పట్టణంతో పాటు వివిధ గ్రామాలకు తాగునీరు అందించేందుకు త్వరలో ప్రణాళిక రూపొందిస్తామన్నారు. మంత్రాలయం పరిసర ప్రాంతాల్లో మినీ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఇప్పటికే గుర్తించామన్నారు. రాఘవేంద్రస్వామి ఆశీస్సులతో దేశం సుభిక్షంగా సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని రాఘవేంద్రస్వామిని ప్రార్థిస్తున్నట్లు పీఠాధిపతి తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ చట్టాన్ని ఆయన సమర్థించారు.