
శ్రీవారి భక్తులకు తిరునగరిలో వసతి ప్రశ్నార్థకంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసే సామాన్య భక్తులకు అష్టకష్టాలు తప్పడం లేదు. గదులు దొరక్క వాహనాల్లో, రహదారులపైనే నిద్రిస్తున్నారు. రానున్న వేసవి రద్దీ నేపథ్యంలో శ్రీనివాసా నీవే మాపై కరుణ చూపాలంటూ వేడుకుంటున్నారు.
నగరంలో సామాన్య భక్తులు సేదతీరేందుకు శ్రీగోవిందరాజ స్వామివారి సత్రాలు ఎంతో అనువుగా ఉండేవి.. దశాబ్దాలుగా నిత్యం వేలమంది వాటినే ఆశ్రయిస్తూ దర్శనాలు పూర్తి చేసుకున్నాక సొంత ప్రాంతాలకు తిరుగుపయనమయ్యేవారు. ఉచితంతోపాటు తక్కువ ధరకే మంచి గదులు దొరికేవి. ఒక్కో గదిలో 10 నుంచి 15 మంది సేద తీరేంత విశాలంగా ఉండేవి. ప్రాంగణంలో యాత్రికుల బస్సులు ఆపేందుకు అనువుగా ఉండేది. నేడు వాటిని కూల్చివేయడంతో గూడు చెదిరిన పక్షుల్లా మారారు. భక్తులకు ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితులు ఎదురవుతున్నాయి. 10 నుంచి 20 మంది సభ్యులతో వచ్చే పేద, మధ్య తరగతి కుటుంబాలు డబ్బులు వెచ్చించి ప్రైవేటు లాడ్జిల్లో దిగే పరిస్థితులు లేవనే చెప్పాలి.
రూ.600 కోట్ల వ్యయంతో నిర్మాణం
గోవిందరాజ స్వామి 2,3 సత్రాల భవనాలను ప్రస్తుతం యంత్రాల సాయంతో తొలగిస్తున్నారు. ఇక్కడ తొమ్మిది అంతస్తులతో నూతన వసతి భవనాలను నిర్మించేందుకు టెండర్లు పూర్తయ్యాయి. ఒక్కో భవనానికి రూ.209 కోట్ల చొప్పున రెండు భవనాలు కలిపి రూ.418 కోట్లతో నిర్మించనున్నారు. మిగిలిన రూ.182 కోట్లతో వసతులు, పార్కింగ్ కల్పించనున్నారు. మొత్తం 540 గదులు రెండు సంవత్సరాల వ్యవధిలో నిర్మించనుండగా అప్పటి వరకు సామాన్య భక్తులు తిరుపతిలో వసతి పొందడం ఎలా అన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అలిపిరి లింక్ బస్టాండు వద్ద రద్దీ పెరిగింది. అక్కడ మరుగుదొడ్లు ఇతర సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేసవి రద్దీ నేపథ్యంలో తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని భక్తులు నివేదిస్తున్నారు.

65 సంవత్సరాలుగా సేవలు
ప్రస్తుత విష్ణునివాసం ప్రాంతంలో శ్రీగోవిందరాజస్వామి మొదటి సత్రం ఉండేది. రైల్వేస్టేషన్ వెనుక రెండు, మూడు సత్రాలు ఉండేవి. వీటిని 1952-59లో నిర్మించారు. రైల్వే స్టేషన్లో భక్తులు దిగిన వెంటనే గదులు సులువుగా దొరికేవి. శ్రీనివాసం, విష్ణు నివాసాల్లో స్పాట్ బుకింగ్ లేకపోవడంతో గదులు దొరక్క ఇక్కడి డార్మిటరీలు, హాళ్లలోనే పెద్దఎత్తున సేదతీరుతున్నారు. కనీసం కాలుపెట్టే పరిస్థితి లేక రోడ్లపైకి చేరుకుంటున్నారు.





