
మహాశివరాత్రి పర్వదినాన ఉపవాస సమయంలో అల్పాహారం, ఇతర చిరుతిళ్లు తిన్న అనంతరం 50 మందికిపైగా అస్వస్థతకు గురైన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. వారంతా జిల్లాలోని కంప్టీతో పాటు నాగ్‌పుర్ నగరంలోని పలు ప్రాంతాలకు చెందినవారని అధికారులు తెలిపారు. స్థానికంగా కొన్ని దుకాణాలు, రోడ్డుపక్కన బండ్లపై కొనుగోలు చేసిన ఫరాలి (సగ్గుబియ్యం, బంగాళాదుంపలతో చేసే వంటకం) తిన్న తరువాత చాలామంది కడుపునొప్పితో ఇబ్బందిపడ్డారు. వాంతులు చేసుకున్నారు. గణేశ్‌నగర్‌లో ఒక కుటుంబంలోని ఏడుగురు సభ్యులు జిలేబీలు, ఇతర తినుబండారాలు తిన్న తరువాత ఫుడ్ పాయిజన్‌తో బాధపడ్డారని ధంతోలి పోలీసుస్టేషన్ అధికారులు తెలిపారు. ఇట్వారీలోని నంగపుట్ల ప్రాంతానికి చెందిన ఓ దుస్తుల వ్యాపారి ఒక పూజా కార్యక్రమంలో ప్రసాదం తిన్న తర్వాత, వర్ధమాన్ నగర్‌కు చెందిన వ్యక్తి అర్ధరాత్రి భోజనం చేశాక, రాణాప్రతాప్ నగర్‌కు చెందిన వృద్ధురాలు ‘కడి’ తిన్నాక ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. బాధితులను వివిధ ఆసుపత్రుల్లో చేర్చామని, వారిలో ఎక్కువ మంది శనివారం డిశ్ఛార్జి అయ్యారని పేర్కొన్నారు.





