
అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ‘ఎంహెచ్ 60ఆర్’ సీహాక్ తరహా హెలికాప్టర్లను భారత నౌకాదళం రంగంలోకి దించింది. దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, క్షిపణులను నాశనం చేసి, నిఘా పెంచేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. తొలి నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్‌ను కొచ్చిన్‌లోని దక్షిణ నౌకాదళంలో బుధవారం ప్రారంభించారు. నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ సమక్షంలో వీటి సేవలు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నౌకాదళాల్లో ఒకటిగా పేరొందిన భారత నౌకాదళం వీటిరాకతో మరింత పటిష్ఠంగా మారనుంది. లాక్‌హీడ్ మార్టిన్ కార్పొరేషన్ నుంచి సీహాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి 2020 ఫిబ్రవరిలో అమెరికాతో మన దేశం ఒప్పందం కుదుర్చుకుంది. శత్రుదేశాల జలాంతర్గాములనే కాకుండా వాటి యుద్ధనౌకలను గుర్తించి నిమిషాల వ్యవధిలో ఇవి దాడి చేయగలవు. సహాయక చర్యలకు, సిబ్బంది రవాణాకు, వైద్య సామగ్రి తరలింపునకు కూడా ఉపయోగపడతాయి. వీటిని ఎక్కడికైనా సులభంగా తరలించవచ్చు. హెలికాప్టర్ ముందు భాగంలోని సెన్సర్లు ఎదురుగా ఉన్న జలాంతర్గామిని లేదా క్షిపణిని స్పష్టంగా చిత్రీకరించగలవు. ప్రారంభోత్సవం సందర్భంగా ఈ హెలికాప్టర్లు ఆకాశంలో వివిధ ఆకృతులను ఏర్పరిచేలా విన్యాసాలు చేశాయి. తొలుత.. సంప్రదాయం ప్రకారం వీటిపైకి నీటిని విరజిమ్ముతూ స్వాగతించారు.





