
(మార్చి 05 – స్వామి దయానంద సరస్వతి వర్ధంతి )
‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అన్న నినాదం ఇచ్చినది బాలగంగాధర తిలక్ అని మనకు తెలుసు. కానీ ఆయన కంటె చాలా ముందే, 1876లోనే బ్రిటిష్ వారినుంచి విముక్తి కావాలి, భారతదేశానికి స్వరాజ్యం కావాలి అని ఒక సాధువు నినదించారు. ఆయనే స్వామి దయానంద సరస్వతి. భారతదేశపు స్వాతంత్ర్యోద్యమానికి పితామహుడు ఆయన. భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రను చదివితే ఆ కాలానికి చెందిన చాలామంది నాయకులు, దేశభక్తులు, విప్లవవీరులు స్వామి దయానంద సరస్వతి బోధనలతో స్ఫూర్తి పొందారని తెలుస్తుంది. వారిలో శ్యాంజీ కృష్ణవర్మ, స్వామి శ్రద్ధానంద, లాలా లజపత్ రాయ్..ఇలా ఆయన శిష్యులు ఎందరో ఉన్నారు. విప్లవ మార్గంలో నడిచిన దేశభక్తులు బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, గేందాలాల్ దీక్షిత్, స్వామి భవానీ దయాళ్, భాయి పరమానంద్, భగత్‌సింగ్, రాంప్రసాద్ బిస్మిల్, యశ్‌పాల్, గణేశ్ శంకర్ విద్యార్థి వంటి వారు సైతం దేశభక్తి అనే గుణాన్ని అందిపుచ్చుకున్నది ఆర్యసమాజం నుంచే. దయానంద సరస్వతి బోధనలు, దార్శనికత మహాత్మా గాంధీని సైతం గణనీయంగా ప్రభావితం చేసాయి. గాంధీ గురువు గోపాలకృష్ణ గోఖలే, ఆయన గురువు జస్టిస్ గోవింద రానడే… దయానంద సరస్వతి శిష్యులు మాత్రమే కాదు, ఆయన స్థాపించిన పరోపకారిణీ సభలో సభ్యులుగా పనిచేసారు కూడా.
1857 విప్లవం తరువాత ఆనాటి విప్లవానికి మానసిక, సామాజిక, సాంస్కృతిక వారసులుగా నిలిచిన వారి జాబితాలో మొట్టమొదటి పేరు స్వామి దయానంద సరస్వతిదే అని ఇంద్రవిద్యా వాచస్పతి చెప్పారు. రాజకీయాల్లో జాతీయవాదాన్ని ఘనంగా ప్రకటించిన వ్యక్తి స్వామి దయానంద సరస్వతి అంటే అతిశయోక్తి కాదు. ‘భారతదేశం భారతీయులకే’ అని మొట్టమొదట చెప్పిన వ్యక్తి దయానంద సరస్వతే అని అనీ బిసెంట్ స్పష్టం చేసారు. దయానంద సరస్వతి రచించిన ‘సత్యార్థ ప్రకాశ’లో ఆనాటి భారతదేశపు స్థితిగతులను హృదయాలను కలచివేసేలా వర్ణించారు. అవి చదివి దయానంద దేశభక్తి స్ఫూర్తిని గ్రహించినప్పుడు… సనాతన ధర్మ అనుయాయి, దేశభక్తుడూ అయిన మదన్ మోహన్ మాలవీయ కళ్ళు నీళ్ళతో నిండిపోయాయని ఆయనే చెప్పుకున్నారు. ఈ ఉదాహరణలన్నీ చూసాక మనకు అర్ధమయ్యేది ఒకటే. స్వామి దయానంద సరస్వతి తన జాతీయవాద భావజాలంతో భారత స్వాతంత్ర్య సంగ్రామానికి స్ఫూర్తినీ, శక్తినీ అందించారు. భారతీయ సంస్కృతి విదేశీ ప్రభావాలకు లోనైన తరుణంలో భారతదేశం కోసం, హిందువుల కోసం కృషి చేసిన మహనీయుడు స్వామి దయానంద సరస్వతి.
స్వామి దయానంద సరస్వతిగారు విక్రమనామ సంవత్సరం 1881 పాల్గుణ కృష్ణ పంచమినాడు గుజరాత్ కఠియవాడ్ ప్రాంతం మోర్బీ జిల్లాలోని తంకారా అనే ఊరిలో జన్మించారు. ఈ సంవత్సరం మార్చ్ 5న ఆయన జయంతిని నిర్వహించుకుంటున్నాం. ఆయన మూలా నక్షత్రంలో పుట్టినందున ఆయనకు మూలశంకర్ అని పేరు పెట్టారు. స్వామి దయానందర సరస్వతి అందరూ బాగా చదువుకోవాలని భావించేవారు, దాన్నే విస్తృతంగా ప్రచారం చేసారు. దేశంలోని మహిళలకు సరైన విద్య ఉండాలని ఆయన వాదించేవారు. మహిళలను పూజించాలని ఆయన భావన. దయానంద సరస్వతి అథర్వవేదం గురించి వివరిస్తూ, బాలికలు కూడా బ్రహ్మచర్యాన్ని అనుసరించాలనీ, విద్యను అభ్యసించాలనీ చెప్పారు. ఇంగ్లీషు చదువులు చదువుకున్న యువతరాన్ని భారతీయ భాషల గౌరవంతో ఆకట్టుకోవాలనుకునేవారు. ఆయన రచన ‘సత్యార్థ ప్రకాశ’లో హిందీ వినిమయం ఆయన ప్రజలను జాగృతం చేయడానికి అవతరించిన నాయకుడని, సాధారణ జనజీవనంలో ప్రాచీన ఆదర్శాలను అనుసరించాలని చాటిచెప్పారనీ తెలియజేస్తుంది. నైతిక ఆదర్శాలు కలిగిన వ్యక్తి సహజంగానే సామాజిక, రాజకీయ సమృద్ధి సాధిస్తాడని ఆయన విశ్వసించారు. అలా ఆయన ఐహిక, నైతిక, సామాజిక ఉద్భవాన్ని బలంగా సమర్ధించారు.
దయానంద సరస్వతి 1880లో మీరట్‌లో పరోపకారిణి సభ స్థాపించారు. దాని ప్రధాన లక్ష్యం వేద వేదాంగాలను సరైన వ్యాఖ్యానంతో ముద్రించి ప్రచురించడం.1875న బొంబాయిలో స్థాపించిన ఆర్యసమాజం ప్రధానంగా అనాధలను రక్షించడం, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ, వైదిక పరిశోధనలపై దృష్టి సారించింది. హిందూమతంలోనుంచి ఇతర మతాల్లోకి మారినవారిని తిరిగి వెనక్కు హిందూమతంలోకి తీసుకొచ్చే శుద్ధి ఉద్యమాన్ని దయానంద సరస్వతి ప్రారంభించారు. ఆ ఉద్యమంలో భాగంగా లక్షలాది ముస్లిములు, క్రైస్తవులను శుద్ధిచేసి సనాతన వైదిక ధర్మంలోకి తీసుకొచ్చారు. ఆ ప్రయోజనం కోసం స్వామి దయానంద శిష్యుడైన స్వామి శ్రద్ధానంద 1923 ఫిబ్రవరి 11న భారతీయ శుద్ధి సభను స్థాపించారు. స్వామి దయానంద సరస్వతి 1883 అక్టోబర్ 30న సిద్ధి పొందారు. వేదాలను, వాటి సారాంశాన్నీ సరైన వ్యాఖ్యానంతో ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం ఆయన సాధించిన మహోన్నత ప్రయోజనం.





