
మన విద్యాలయాలలో బోధిస్తున్న భారతదేశ చరిత్ర చదివితే ‘హిందువులు ఎప్పుడు ఎవరితో పోరాడి ఎలా పరాజితులయ్యార’నే విషయం ప్రాధాన్యం వహిస్తుంది. మహారాష్ట్ర సామ్రాజ్యం నెలకొల్పిన శివాజీ మహారాజును ఔరంగజేబు ‘కొండ ఎలుక’ అన్నాడని రాస్తారు. కానీ ఛత్రపతి శివాజీ గురించి చదివితే ఒళ్లు పులకరిస్తుంది. ఆ విషయాలేవీ ఈ చరిత్ర పుస్తకాలలో కనబడవు. దక్షిణ భారత సామ్రాజ్యాన్ని ఏలిన శ్రీకృష్ణదేవరాయల పాలనలో పన్నులు అధికంగా ఉన్నాయని చరిత్ర పుస్తకాల్లో ఉంది. ఆ మహారాజు చరిత్ర, చేసిన భాషాసేవ, సంస్కృతి, పోషణ వేరే పుస్తకాల్లో చదవవలసిందే.
శకపురుషుడు విక్రమాదిత్యుడు. ఆయన చేసిన ఘనకార్యం కాళిదాస మహాకవి జ్యోతిర్విద్యాభరణమనే శాస్త్రగ్రంథంలో చెప్పాడు. విక్రమార్క మహారాజు సభలో శ్రీ శుకువు, సువాక్కు, వరరుచి, మణి అంగుదత్తుడు, విష్ణువు, త్రిలోచనుడు, ఘటకర్పురుడు, అమరసింహుడు, సత్యుడు, వరాహమిహిరుడు, శ్రుతసేనుడు, బాదరాయణుడు, మణిత్థుడు, కుమారసింహుడు, కాళిదాసు మొదలైన కవి పండితులున్నారు. వీరు వేరు వేరు శాస్త్రాలలో దిగ్గజాల వంటివారు. ఆ మహారాజును జైన కవులు ప్రశంసించిన శ్లోకాలు లభిస్తున్నాయి. పైన పేర్కొన్న వారిలో తొమ్మిది మందిని నవరత్నాలంటారు. ఆ చక్రవర్తికి 800 మంది సామంతులున్నారు. ఆయనకు 3 కోట్లు పదాతులు, 24,300 ఏనుగులు, పదివేల గుఱ్ఱాలు, పదివేల రథాలు సైన్యం ఉండేది. విక్రమార్కుడు 99,999 శకులను సంహరించి కలియుగంలో విక్రమశకం స్థాపించాడు. ఈ విక్రమార్కుడు ద్రవిడ దేశాన్ని, గాంధార దేశాన్ని, వంగ దేశాన్ని, గౌడ దేశాన్ని గుజరాత్‌ను, ధారా రాజ్యాన్ని, కాంభోజ దేశాన్ని కూడా జయించాడు. హిమాలయంపైన ఉండే జయింపశక్యం కాని దుర్గాలను జయించి ఆ రాజ్యాలను ఆ ప్రభువులకే ఇచ్చివేశాడు. ఆయన రాజధాని ఉజ్జయిని. రుక్మ దేశానికి అధిపతి అయిన శకేశ్వరుణ్ణి జయించి ఉజ్జయినికి తీసుకువచ్చి, ఊరేగించి వదిలిపెట్టాడు. (శకేశ్వరుడంటే హిమాలయాలకు ఆవల ఉన్న శకుల రాజు.) విక్రమార్కుని దేశం మాళవ దేశం. కలియుగాది నుంచి 3068వ సంవత్సరంలో ఈ గ్రంథం రాశానని కాళిదాస మహాకవి చెప్పాడు. ఇది ఈ విక్రమార్కుని కాలం. విదేశీయులను కూడా జయించడం వలన ఉత్తరాదిన ఇప్పటికీ విక్రమ సంవత్ అంటే విక్రమ శకం వాడుతున్నారు. ఈ విక్రమార్కుని గురించి భారతదేశ చరిత్రలో ఇతని పేరు చంద్రగుప్తుడని, ఇతనికి విక్రమాదిత్యుడనే బిరుదం ఉందని రాశారు. ఇతడు క్రీ.శ. 388–409 మధ్య శకులను ఓడించాడని రాశారు. కాలం సుమారు 400 సంవత్సరాలు మారిపోయింది.
‘‘మొహంజోదారో నాగరికత వారు మత చిహ్నాల్ని వదల లేదు, వారి మతం తెలియదు’ అని రొమెల్లా థాపర్ రాశారు. నేనా నాగరికత అవశేషాలను పరిశీలించాను. దానిలో ఆమె చెప్పిన మూడు తలల పశుపతి దేవునికి మూడు తలలు, రెండు కొమ్ములు లేవు. అది వేదం, శివాష్టోత్తరం మొదలయినవి వర్ణించిన రుద్రరూపం. రుద్రుని తలపై చంద్రుడు, గంగ, పాము, పక్కన ప్రణవ చిత్రం మొదలైనవి ఉన్నాయి. ఆ అవశేషాలలో స్వస్తికం, శివావతార చిత్రాలు కూడా ఉన్నాయి. వీటిపై వ్యాసాలు రాసి ప్రచురించాను.
ఇపుడు చరిత్ర పాఠాల్లో శ్రీమద్రామాయణం, మహాభారతం చేర్చే ప్రయత్నం జరుగుతోంది. 75 సంవత్సరాల వెనుక జరుగవలసిన పని ఇది. అభినందించదగినది. కాని శ్రీరామునికి, యుధిష్ఠిరునికి మధ్య ఉన్న రాజుల విషయం, యుధిష్ఠిరునికి చంద్రశ్రీ చంద్రగుప్తునికి మధ్య ఉన్న పరిపాలకుల విషయం కూడా చేరిస్తేనే దేశ చరిత్రకు సరియైన ఆకృతి వస్తుంది. ఋషభదేవుని కుమారుడు భరతుని పేర భారతవర్షమేర్పడింది. అంతకుముందు దీనిని అజనాభమనేవారు. అంగ, వంగ, కళింగ, పౌండ్ర, ఆంధ్ర, ద్రవిడ దేశాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలియాలి. చారిత్రక పురుషుడు శ్రీకాకుళాంధ్ర విష్ణువు. ఆయన చరిత్రకు త్రిలింగ అనే పదానికి సంబంధం ఉంది. త్రిలింగ పదం నుండి తెలుగు పదం వచ్చిందనడానికి చాలా ఆధారాలున్నాయి.
శ్రీరామునిది ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకువు నుండి శ్రీరాముని వరకు 65 తరాల పరిపాలకులున్నారు. వీరిలో అయోధ్యను నిర్మించిన ఇక్ష్వాకువు, మహాత్మాగాంధీ సత్యాగ్రహబుద్ధికి కారణమయిన సత్యహరిశ్చంద్రుడు, సముద్రానికి సాగరమనే పేరు రావడానికి కారణమయిన సగరపుత్రులు, గంగకు భాగీరథి అనే పేరు కలిగించిన భగీరథుడు ఉన్నారు. కాళిదాస మహాకవి ఈ వంశంలో కొందరి చరిత్రలు రఘువంశమనే పేరుతో రాశాడు. శ్రీరాముని తరువాత ఆ వంశం వారు 30 మంది ఉన్నారు. వారిలో చివరివాడు బృహద్బలుడు అర్జునుని కుమారుడైన అభిమన్యువు చేతిలో మరణించాడు. రామాయణానికి భారతానికి మధ్య ఉండే పరిపాలకుల చరిత్ర చేరితే ఈ రెంటికీ మధ్య ఉన్న అగాధం పూడుతుంది. ఇక్ష్వాకువు కుమారుడు నిమి. అతని కొడుకు మిథి. అతడే మిథిలానగరం నిర్మించాడు. అది జనక మహారాజు రాజధాని. వీరి వంశంలో సుశ్రుతుడున్నాడు. ఇతడు గొప్ప వైద్యుడు కావచ్చు. చంద్రవంశంలో మొదటి రాజు పురూరవుడు. అతని చరిత్రను కాళిదాస మహాకవి విక్రమౌర్యశీయ నాటకంగా రాశాడు. పురూరవుని వంశంలో ఆనర్తుని పేరుతో ఆనర్త దేశం ఉండేది. ఇది రుక్మిణి తండ్రి భీష్మకుని దేశం. ఇతని కుమారుడు రేవతుడు. సముద్రతీరంలో కుశస్థలి అనే నగరం నిర్మించాడు. అది సముద్రంలో మునిగింది. తరువాత సముద్రం వెనక్కు వెళ్ళింది. ఆ నేల మీద శ్రీకృష్ణుడు ద్వారక నిర్మింపజేశాడు. శ్రీకృష్ణుని అవసాన కాలంలో ఈ నగరాన్ని సముద్రం మళ్లీ ముంచేసింది. ఎస్.ఆర్.రావు ద్వారక దగ్గర సముద్రంలో పరిశోధిస్తే ద్వారక అవశేషాలు లభించడమే కాక దాని కింద మరో నగరం కూడా ఉండేదని ఆధారాలు లభించాయి. చంద్రవంశంలో వాడు భరత చక్రవర్తి. కిరాతులను, హూణులను, యవనులను, కంకులను, ఖశులను, శకులను జయించాడు. ఇతని పేరుమీద భారతదేశమనే పేరు వచ్చిందని చెప్తారు. ఈ వంశంలో హస్తి అనే రాజు హస్తినానగరం నిర్మించాడు.
యుధిష్ఠిరుని నుంచి చంద్రగుప్తుని వరకు ఉండే పరిపాలకుల పేర్లు, వంశాల పేర్లు కూడా చరిత్రలో చేరాలి. యుధిష్ఠిరుని కాలం వాడు జరాసంధుడు. ఇతని తండ్రి బృహద్రథుడు. ఇతని నుండి 107 మంది పరిపాలకుల పేర్లు, 30 గణాల పాలకుల పేర్లు లభిస్తున్నాయి. వీరి పాలనా కాలాలు కూడా ఉన్నాయి. వీరిలో అజాతశత్రువు పేరు బుద్ధ జాతకాలలో కనబడుతుంది. బృహద్రథ వంశం, ప్రద్యోత వంశం, శిశునాభ వంశం, మౌర్య చంద్రగుప్త వంశం పాలించిన తరువాత పుష్యమిత్రుని కుమారుడు అగ్నిమిత్రుడు పాలించాడు. ఇతని చరిత్రను కాళిదాసు మాళవికాగ్నిమిత్రం నాటకంగా రచించాడు. ఈ కోణంలో చూస్తే కాళిదాసు చారిత్రక నాటకాలను, చారిత్రక కావ్యాన్ని రచించాడని అవగతమవుతుంది. అగ్నిమిత్రునిది శుంగవంశం. వీరి తరువాత ఆంధ్రరాజులు పాలించారు. వీరిలో శాతకర్ణి, హాలాహలుడు (హాలుడు– ఇతడు గాథాసప్తశతి సంకలనం చేసినవాడు.) శాతకర్ణి, శివస్కంధుడు, యజ్ఞశ్రీ, చంద్రశ్రీ పేర్లు చరిత్ర పుస్తకాల్లో కనబడతాయి. మాక్స్‌ముల్లర్ మొదలయిన పాశ్చాత్యుల చేతివాటం వల్ల వీరందరు కొన్ని వందల సంవత్సరాలు ముందరకు వచ్చేశారు. కాని అతి ప్రాచీనమయిన పరాశరుని విష్ణుపురాణం ప్రకారం వీరి తర్వాత చాలా మంది పాలకులుగా వచ్చారు. వారిలో ఆంధ్రభృత్యులు, యవనులు మొదలయినవారు చాలా మంది ఉన్నారు.
అలెగ్జాండర్ దండయాత్రా కాలంలో భారతదేశంలో ఆంధ్రరాజులలో చివరివాడు చంద్రశ్రీరాజు. అతడు మైనరు. అతనికి రక్షకులు మంత్రి సేనాపతులు చంద్రగుప్త సముద్రగుప్తులు. ఈ చంద్రగుప్తుడే మౌర్యచంద్రగుప్తుడని పాశ్చాత్యులు రాశారు. భారతీయ చరిత్రకారులు వారిని అనుసరించారు. చంద్రగుప్త మౌర్యునికి చంద్రశ్రీ చంద్రగుప్తునికి మధ్యలో 48 మంది పాలకులు ఉన్నారు. వీరిద్దరినీ ఒకరిగా చెప్పడం వలన ఆ 48 మంది పాలనాకాలం భారతదేశ చరిత్రలో అదృశ్యమయింది. ఈ తప్పును ట్రాయి పండితుడు మాక్స్‌ముల్లర్‌కు చెప్పాడు. కాని అతడు సవరించలేదు. తరువాత కుప్పయ్య అనే ఆంధ్ర పండితుడు తప్పును ఎత్తిచూపాడు. ఆ తరువాత కోట వెంకటాచలం ఈ పొరపాటును నిరూపించారు. అయినా భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు దీనిని సరిచేయలేదు.
సాంచీ స్థూపం మీద లక్ష్మీదేవికి ఏనుగులు అభిషేకం చేస్తున్న సన్నివేశం ఉంది. ఈ సన్నివేశం ఋగ్వేదానికి చెందిన శ్రీసూక్తం ధ్యాన శ్లోకంలో ఉంది. దాన్ని డిడి కోశాంబి మాయాదేవి చిత్రం అని చెప్పారు. మాయాదేవికి ఏనుగులు కలలో కనబడ్డాయి తప్ప ఆమెకు ఏనుగులు స్నానం చేయించిన సన్నివేశం బుద్ధ చరిత్రలో కనబడదు. మాయాదేవికి ఏనుగులు కలలో కనబడిన దృశ్యంతో ఒక శిల్పం వేరే ఉంది.
ఇలా చరిత్రలో ఎన్నో అసంగత విషయాలు కనబడతాయి. చరిత్ర చదివితే దేశభక్తి కలగాలి తప్ప, చదివినవారు దేశాన్ని ముక్కలు చేస్తాం అనకూడదు. సత్యమయిన ఉదాత్తమైన దేశభక్తిని కలిగించే భారతదేశ చరిత్ర వెలువడాలని కోరుకుందాం.
– డాక్టర్ చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మ





