
భారతీయులు, భారత సంతతికి చెందినవారిపై అగ్రరాజ్యం అమెరికాలో దాడులు ఆగడం లేదు. అక్కడి తుపాకీ సంస్కృతికి తాజాగా భారత్‌కు చెందిన సంప్రదాయ నృత్య కళాకారుడు బలయ్యారు. కూచిపూడి, భరతనాట్యంలో ప్రవేశమున్న అమర్‌నాథ్ ఘోష్ (34)పై మిసోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ అకాడమి, సెంట్రల్ వెస్ట్‌ఎండ్ పరిసరాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు పలుమార్లు కాల్పులు జరిపారు. సాయంత్రపు నడకకు వెళ్లిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సెయింట్ లూయిస్ మెట్రోపాలిటన్ పోలీసులు దీన్ని ధ్రువీకరించారు.
గత రెండు నెలల్లో అమెరికాలోని భారతీయ విద్యార్థులపై జరిగిన దాదాపు ఆరో అఘాయిత్యమిది. నృత్యంపై ఎన్నో కలలతో ఉన్న ఘోష్.. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయడానికి గతేడాదే పశ్చిమబెంగాల్ నుంచి అమెరికాకు వచ్చారు. చెన్నైకు చెందిన ‘కళాక్షేత్ర’ పూర్వ విద్యార్థి ఈయన. చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ ఈ ఘటనపై స్పందిస్తూ..‘‘అమర్‌నాథ్ ఘోష్ కుటుంబానికి అన్నివిధాలా సహాయపడతాం. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని స్థానిక పోలీసులను, యూనివర్సిటీ అధికారులను కోరాం’’ అని ‘ఎక్స్’ ద్వారా పేర్కొంది. అమర్‌నాథ్ ఘోష్ దుర్మరణం గురించి అధికారిక సమాచారం ఏదీ అందక తాము ఇప్పటికీ గందరగోళంలోనే ఉన్నామని పశ్చిమబెంగాల్‌లోని సూరీ పట్టణంలో ఉంటున్న ఆయన మావయ్య శ్యామల్ ఘోష్ తెలిపారు.





