News

అయోధ్య రామమందిరం భారత జాతీయ దేవాలయం

338views

జాతి, మత, కుల, ప్రాంత బేధాలు లేకుండా మనమంతా హిందువులం..ఒకే తల్లి కన్నబిడ్డలం అనే భావనకు ప్రతీకే అయోధ్య రామ మందిరమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సహక్షేత్ర ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ తెలిపారు. కదిరి పట్టణంలో సేవా భారతి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయోధ్య సీతారాములవారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భరత్ కుమార్ మాట్లాడుతూ, మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్ని అధ్యయనం చేయాలని, అందుకే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందన్నారు. జనవరి 22న అయోధ్యలో నిర్వహించిన బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన విధంగా మన ఆలోచనను దేవత నుంచి దేశానికి, రాముడు నుంచి దేశానికి విస్తరించాలని సహక్షేత్ర ప్రచారక్ ఉద్ఘాటించారు. కదిరిలో కళ్యాణం నిర్వహించుకోవడం అంటే రాముడు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని పాటిస్తామని చెప్పేందుకే అన్నారు.

రావణ సంహారం తర్వాత లంకా నగరంలో సంచరిస్తూ ఆ నగర సౌందర్యానికి ముగ్థుడైన లక్ష్మణునితో, ‘బంగారం నిండినదైనా నాకు లంకా నగరం రుచించదు లక్ష్మణా, జననీ, జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి,’ అంటూ రాముడు చెప్పిన విషయాన్ని భరత్‌కుమార్ గారు గుర్తు చేశారు. రాముడిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన దేశం పట్ల ఆ విధమైన భక్తిశ్రద్ధలను ప్రకటించాలని పిలుపునిచ్చారు. రామమందిర నిర్మాణం కూడా అందుకే జరిగిందన్నారు. శ్రీ అయోధ్య సీతారాముల కళ్యాణ మహోత్సవంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, సత్యసాయి జిల్లా ఎస్పీ, రాష్ట్రీయ స్వయంసేవక్ ప్రాంత ప్రచారక్ ఆదిత్య, ప్రాంత సహకార్యవాహ్ యుగంధర్‌లతో పాటు 250 గ్రామాల నుంచి 15 వేల మంది భక్తులు పాల్గొన్నారు.