
( ఫిబ్రవరి 29 – గాడిచర్ల హరి సర్వోత్తమ రావు వర్థంతి )
వందేమాతరం ఉద్యమంలో తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడిగా కఠోర జైలు జీవితం అనుభవించిన వ్యక్తి ‘ఆంధ్రా తిలక్’ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు. అకుంఠిత దీక్షతో తన సర్వశక్తులను దేశసేవ కోసమే అంకితం చేసిన నిస్వార్థ సేవకుడు ఆయన. పత్రికా రచన, సంఘ సంస్కరణ, సాహిత్యం, వయోజన విద్య, గ్రంథాలయోద్యమం వంటి ఉద్యమాలన్నింటిలో గాడిచర్లవారి పాత్ర ఉంది. కర్నూలు జిల్లాలో 1883 సెప్టెంబర్ 14న భాగీరథీ బాయి, వెంకటరావు దంపతులకు జన్మించి, చెన్నపట్నం క్రైస్తవ కాలేజీలో ఉన్నత విద్య అభ్యసించి, టీచర్ ట్రైనింగ్‌కి రాజమండ్రి చేరిన గాడిచర్ల హరి సర్వోత్తమరావు జీవితం నాటి బిపిన్ చంద్రపాల్ ప్రసంగంతో మలుపు తిరిగింది.
ఆనాడు వందేమాతరం ఉద్యమంలోకి విద్యార్థులందరినీ తీసుకువెళ్లిన ఆయనకు, జీవితంలో ఎక్కడా టీచర్ ఉద్యోగం ఇవ్వకూడదంటూ బ్రిటీష్ ప్రభుత్వం 1907లో ఒక ప్రత్యేక జీవో జారీ చేసింది. ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి జైలుకు పంపింది. జైలులో మెడకు ఇనుప కడియం, కొయ్యదుంగ బిగించారు. గోచీ మాత్రమే ఇచ్చారు. మల మూత్ర విసర్జనకు ఒక మట్టి చట్టి, నీళ్లకు ముంత. పుస్తకాలు చదవరాదు. కాగితం మీద రాయకూడదు. అటువంటి కఠినమైన శిక్షను వెయ్యి రోజుల పైన గడపాలంటే ఎంత మానసిక స్థిరత్వం, దేశభక్తి ఉండి ఉండాలో ఊహించండి.
ఆంధ్రపత్రిక వంటి దినపత్రిక మద్రాసులో ప్రారంభమైనప్పుడు దాని తొలి సంపాదకుడు గాడిచర్ల. నాటి నుండి ఇంగ్లీషు, తెలుగు పత్రికలకు వ్యాసాలు, సమీక్షలు రాయటం చేస్తూనే ఉండేవారు. వయోజన విద్య ఉద్యమంలో, రాయలసీమ సమస్యల పరిష్కార ఉద్యమంలో, గ్రంథాలయ ఉద్యమంలో గాడిచర్లవారిది ప్రత్యేక స్థానం. ఆయన అనేక కార్మిక సంఘాలకు నాయకుడు. సహకార ఉద్యమంలోనూ పాత్ర పోషించారు. బహుశా నాటి సామాజిక ఉద్యమాలలో ఆయన పాత్రలేని ఉద్యమం లేదంటే అతిశయోక్తి కాదు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు మద్రాసు రాష్ట్ర కౌన్సిల్‌లో కొంతకాలం సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్ర మహాసభకి అధ్యక్షత వహించారు. తన కార్యస్థానంగా విజయవాడను ఎంచుకుని 1948లో సర్వోత్తమ భవనాన్ని నిర్మించుకుని అక్కడి నుండి పలు ఉద్యమాలకు దానిని వేదికగా మలిచారు. గ్రంథాలయ ఉద్యమమే ఊపిరిగా అనేక దశాబ్దాలు తన జీవితం కొనసాగించారు గాడిచర్ల గారు.
గాడిచర్ల వారి జీవితమంతా ఉద్యమాలతోనే గడిచింది. ఉద్యమమే ఉచ్చ్వాసనిశ్వాసాలుగా, పనులకు ముందు-పదవులకు వెనకగా పని చేసిన హరి సర్వోత్తమరావు జీవితమంతా పేదరికమే. ఇరవయ్యవ శతాబ్దపు తొలి దశాబ్దంలో ‘ఆంధ్రా తిలక్’ అని కొనియాడిన కాంగ్రెస్ నాయకులే గాడిచర్ల హరిసర్వోత్తమరావు తమకి ఎవరో తెలియనట్లు ప్రవర్తించారు. స్వాతంత్ర్యం తర్వాత తెలుగు రాష్ట్రం కోసం ఉద్యమించాలని గాడిచర్లవారు అన్నప్పుడు అధిష్టానానికి భయపడి ఆయన మీద వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించిన నాయకులు, ఆంధ్ర రాష్ట్రం రాగానే గబగబా మంత్రి పదవులు పంచుకున్నారు. ఆ రోజు కూడా గాడిచర్లవారు ‘నా సంగతేమిటని’ ఎవరినీ అడగలేదు. భరతమాత సంకెళ్లు తొలిగించేందుకు నేను పని చేశానే కానీ పదవులు ఆశించి కాదని ఆయన స్పష్టం చేశారు. గాడిచర్లవారు తనతో పాటు గ్రంథాలయ ఉద్యమంలోకి వచ్చిన వారిని సొంత పిల్లలుగా చూసుకున్నారు. అటువంటి శిష్యులు కొందరు ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలను కలిసి ఆయనను ఎమ్మెల్సీ చేస్తే బాగుంటుందని సూచిస్తే, ప్రజలు మరచిపోయిన ఆయన్ని తిరిగి మళ్లీ మనం గుర్తు చేయటం ఎందుకని వారు వ్యాఖ్యానించారు. ఇది నిజమైన దేశభక్తులకు కాంగ్రెస్ రాజకీయాలు ఇచ్చిన కితాబు.
గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారి చివరి రోజులు ఆయన శిష్యులు, అభిమానులు, కొన్ని సంస్థలు సమకూర్చిన ఆర్థిక సహాయంతో గడిచింది. గాడిచర్ల స్వయంగా ఎవరినైనా పని ఇమ్మని అడిగారు కానీ డబ్బు ఇవ్వమని ఏ రోజు అడగలేదు. 1959 డిసెంబర్ 14న ఇంట్లో పడిపోయిన గాడిచర్లవారిని రాయపేట ఆస్పత్రిలో చేర్చగా, ఆస్పత్రిలో ఉన్న సమయంలో కూడా గ్రంథాలయోద్యమాన్ని మరింత విస్తృతం చెయ్యాలన్న కలవరింతలతోనే మంచం మీద ఉండేవారు. జ్ఞాపకశక్తి వస్తూ పోతూ ఏవేవో మాట్లాడుతూ 1960 ఫిబ్రవరి 29న ఆయన కాలం చేశారు. నిస్వార్థ ప్రజా సేవకుడు, నిష్కళంక దేశభక్తుడైన గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు మనకు నిరంతర స్ఫూర్తి ప్రదాత.





