
( ఫిబ్రవరి 22 – కొండా వెంకటప్పయ్య జయంతి )
మనం మనస్ఫూర్తిగా కోరుకున్న స్వరాజ్యం అనే ఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం చేరుకోగానే ఈ స్వాతంత్ర్యయోధులలో నీతినియమాలు అంతరించిపోయాయి. రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతున్నది. ప్రజలు కాంగ్రెస్‌ను దూషిస్తున్నారు. బ్రిటిష్ రాజ్యమే మేలంటున్నారు. ఇప్పుడు స్వతంత్ర దేశంలో కాంగ్రెస్ అవినీతికి ఆలవాలమైపోతున్నది. 1947 డిసెంబర్‌లో ప్రపంచ చరిత్రలోనే ఒక మహోన్నత చారిత్రక ఘట్టంగా చెప్పే స్వేచ్ఛాభారతి ఆవిర్భావం తరువాత మూడు మాసాలకే గాంధీజీకి అందిన ఒక లేఖలోని వ్యథాభరిత వాక్యాలివి. కాంగ్రెస్ పతనావస్థ గురించి అలా లేఖ రాసిన వారు శ్రీ కొండా వెంకటప్పయ్య పంతులు. ఈయన ఏ హిందూ మహాసభ సభ్యుడో, కమ్యునిస్టో అనుకుంటే పొరపాటే. ఆయన గాంధీ మార్గాన్ని తు.చ. తప్పకుండా అనుసరించిన నికరమైన గాంధేయవాది. ఉత్తర భారతంలో బాబూ రాజేంద్రప్రసాద్, దక్షిణాదిలో రాజాజీ మాదిరి తెలుగు ప్రాంతాల నుంచి గాంధీజీకి విశ్వాసపాత్రులుగా శ్రీ కొండా వెంకటప్పయ్య ఖ్యాతి గాంచారు.
కొండా వెంకటప్పయ్య 1866 ఫిబ్రవరి 22న పాత గుంటూరులో పుట్టారు. తల్లి బుచ్చమ్మ, తండ్రి కోటయ్య. వారి ప్రాథమిక విద్య గుంటూరులోనే సాగింది. తరువాత బీఏ, బీఎల్ మద్రాసులో చేశారు. చదువు పూర్తయ్యాక బందరులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. బాల్యం నుంచే దేశభక్తి, ప్రజా సేవాతత్పరత కలిగిన వెంకటప్పయ్య చదువుకునే రోజుల్లోనే పిల్లలకు పాఠాలు చెప్పగా వచ్చే ఏడు రూపాయలను తన తోటి విద్యార్థికి సహాయంగా ఇచ్చేవారు.
నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు కొండా వెంకటప్పయ్య అధ్యక్షుడిగా ఎన్నికై ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి ఒక నిర్దిష్ట కార్యక్రమం రూపొందించారు. భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాల విభజన అవసరాన్ని ఉద్గడించిన ఆంధ్ర ప్రతినిధులలో కొండా వెంకటప్పయ్య ముఖ్యులు. 1921 మార్చి 31, ఏప్రిల్ 1 తేదీలలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు బెజవాడలో నిర్వహించగా, మహాత్ముని ఆంధ్ర పర్యటన వెంకటప్పయ్య ఆధ్వర్యంలోనే జరిగింది. కొండా వెంకటప్పయ్య అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా స్వల్పకాలమే పని చేసినా ఇది ఆంధ్ర రాజకీయ చరిత్రలో స్వర్ణ ఘట్టం. గాంధీజీ తలపెట్టిన ప్రతి ఉద్యమానికి ఆంధ్రలో కొండా వెంకటప్పయ్యే ఆ రోజుల్లో నాయకత్వం వహించేవారు.
ఆంధ్ర ఖద్దరుకి యావద్దేశ ప్రచారం లభించడానికి కొండా వెంకటప్పయ్య కృషి ప్రధానమైనది. మహాత్ముడి పిలుపు మేరకు అనేక గ్రామాలలో హరిజనుల చేత దేవాలయ ప్రవేశం చేయించారు. ఆంధ్ర రాజకీయాల్లో కొండా వెంకటప్పయ్య స్థానం దేశ రాజకీయాలలో మదనమోహన మాలవ్యా స్థానం లాంటిది. ఏమైనా యావద్భారత రాజకీయరంగంలో ఆంధ్రజాతి తన ప్రతిభకు, త్యాగాలకు సముచిత స్థానం పొందలేకపోయినట్లే, ‘‘దేశభక్త’’ కొండా వెంకటప్పయ్య అఖిల భారత రాజకీయాలలో తన ప్రతిభకు, త్యాగానికి సముచిత స్థానం పొందలేకపోయారు. కళాదృష్టితో, కళాతృష్ణతో మానవతవాదిగా, దేశభక్తుడుగా జీవితాంతం కృషి చేసిన నిరాడంబరమూర్తి కొండా వెంకటప్పయ్య 1949 ఆగస్ట్ 15వ తేదీన దేశ స్వాతంత్ర్య పుణ్యదినాన దేశభక్తులైన వారందరినీ సంతాప సాగరంలో ముంచుతూ స్వర్గస్థులయ్యారు.





