
విజయనగర సామ్రాజ్యాధీశుడు హరిహర బుక్కరాయల కాలం నాటి సంస్కృత శాసనాలను కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కనుగొన్నట్లు చరిత్రకారుడు మైనాస్వామి తెలిపారు. శాసనాల సంరక్షణలో భాగంగా అనంతపురం జిల్లా ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు, న్యాయవాది సుబ్బరాజు గుప్తా తదితరులతో కలిసి మైనాస్వామి నృసింహాలయంలో పలు శాసనాలను పరిశీలించారు.
తూర్పు, పడమర రాజగోపురం ద్వారాల్లో, గుడి దక్షిణ గోడ, తూర్పు ప్రాకారంపై శాసనాల ఆనవాళ్లను గుర్తించారు. ఆలయం వెలుపల, లోపలి గోడలను శుభ్రం చేసేటపుడు శాసనాలను చెరిపి వేస్తున్నారని చరిత్రకారుడు మైనా స్వామి ఆవేదన చెందారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ ప్రాశస్త్యాన్ని తెలిపే సామాన్యశకం 1352 నాటి మొదటి బుక్కరాయల శాసనాన్ని మైనాస్వామి చూపించారు. శాసనాన్ని బట్టి ఆలయ నిర్మాణం ప్రధాన గోపురం అప్పటికే పూర్తి అయి ఉండవచ్చన్నారు. రెండో హరిహర రాయలు, ఆయన కుమారుడు ఒకటో దేవరాయలు, విరూపాక్ష రాయలు, శ్రీకృష్ణదేవరాయలు తదితరుల శాసనాలను సంరక్షించుకోవాలని మైనా స్వామి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పుర ప్రముఖులు పాల్గొన్నారు.





