
జమ్మూకశ్మీర్‌లోని కుప్‌వాడా జిల్లాలో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న లష్కరే తోయిబాకు చెందిన ఓ ముష్కరుడిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సైనికుడైన అతడు నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) గుండా ఆయుధాలను, మందుగుండు సామగ్రిని తరలించడంలో కీలక పాత్ర పోషించాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని కుప్‌వాడాకు చెందిన రియాజ్ అహ్మద్‌గా గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవలే భద్రతా బలగాలు ఓ ఉగ్ర కుట్రను భగ్నంచేసి ఐదుగురు ఉగ్రవాదులను అరెస్టుచేశారు.జమ్ము-కశ్మీర్, కుప్వారా జిల్లా పరిధిలో తీవ్రవాదుల కుట్రను ఛేదించే విచారణలో భాగంగా పోలీసులు నిర్వహించిన సోదాలతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 5 ఏకే సిరీస్ రైఫిళ్లు, తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రలో కీలక వ్యక్తి అయిన రియాజ్ పరారీలో ఉన్నాడు. నిందితుడు ఆదివారం ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు చేరుకోనున్నాడన్న సమాచారం ఆధారంగానే దాడిచేసి అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు.
ఖుర్షీద్ అహ్మద్ రాథర్, గుహ్లామ్ సార్వార్ రాథర్ తో కలిసి రియాజ్ తీవ్రవాద చర్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పాకిస్తాన్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు భారత్ లోకి చేర్చడంలో రియాజ్ కీలకపాత్రధారిగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. రియాజ్ నుంచి ఓ మొబైల్ ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.





