
భారత్, మయన్మార్‌ల సరిహద్దులోని 1,643 కిలోమీటర్ల పొడవునా కంచెను నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. సరిహద్దు వెంబడి గస్తీ మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ‘ఇరు దేశాల మధ్య సరిహద్దు వెంట పూర్తిగా కంచెను నిర్మిస్తాం. మణిపుర్‌లోని మోరేలో ఇప్పటికే 10 కిలోమీటర్ల కంచె వేశాం. హైబ్రిడ్ నిఘా వ్యవస్థద్వారా మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో కిలోమీటరు చొప్పున ఫెన్సింగ్ ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లు మయన్మార్‌తో సరిహద్దును కలిగి ఉన్నాయి. ఇప్పటివరకూ సరిహద్దు నుంచి ఇరువైపులా 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది. అయితే ఆ దేశం నుంచి భారత్‌లోకి అక్రమ చొరబాట్లు పెరిగిపోయాయి. ఇలాంటివి అరికట్టేందుకు ఆ దేశ సరిహద్దు వెంబడి కంచె వేస్తామని అమిత్ షా గత నెలలోనే ప్రకటించారు.
రఖైన్ రాష్ట్రానికి వెళ్లొద్దు: మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రానికి వెళ్లొద్దని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు వెంటనే వెనక్కి వచ్చేయాలని మన దేశీయులకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సూచించింది.





