
ముంబై : నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైటెడ్ నేషన్స్ (I.I.M.U.N.) 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 2,000 మంది జెన్ జెడ్, జెన్ ఆల్ఫా విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ప్రభావం, మారుతున్న ఆదర్శప్రాయులు మరియు యువతలో సోషల్ మీడియా వాడకాన్ని భారతదేశం నియంత్రించాలా అనే అంశాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
సోషల్ మీడియాను సరిగ్గా వినియోగించుకోవాలని భాగవత్ సూచించారు. దీనికి కొన్ని నియమాలు రూపొందించాలని, క్రమశిక్షణను కూడా అలవర్చాలని అన్నారు. అయితే.. దృక్పథం మారినప్పుడే అది విజయవంతం అవుతుందన్నారు. ఎన్నో చట్టాలు చేశారని, కానీ.. ఏం జరుగుతోంది అని ప్రశ్నించారు.
సమాజమే అసలైన చట్టం అని అన్నారు. అలాగే ఆదర్శ ప్రాయుల గురించి కూడా ప్రస్తావించారు. గత తరానికి ఆదర్శప్రాయులు వేరుగా వుండేవారని, కాలక్రమేణా ఆదర్శప్రాయులు కూడా సహజంగానే మారుతూ వుంటారన్నారు. ‘‘ఉదాహరణకు సోషల్ మీడియాలో నా స్థానం ఏమిటి? ఒకవేళ పది లక్షల మంది నేను చేసే పనులను అనుసరిస్తుంటే, నన్ను అనుసరించడం వల్ల ఆ పది లక్షల మంది ఎలాంటి అపాయంలోనూ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. కనీసం ఆపాటి స్పృహ అయినా నాకు ఉండాలి. అదే వివేకం.’’ అని మోహన్ భాగవత్ తెలిపారు.
నేడు సోషల్ మీడియా చాలా సాంకేతికంగా అభివృద్ధి చెందిందని, చాలా దూరం కూడా వెళ్లిందన్నారు. అది మనలాంటి ఫోటోలనే సృష్టించి, మనతో మాట్లాడించడం, మన గొంతును అనుకరించడం, మనం అనని మాటలను కూడా అన్నట్లు భ్రమింపజేయడం వరకూ వెళ్లిందన్నారు. ఉదాహరణకు నకిలీ వీడియోలు వంటివి) వంటివి చేయగలదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు విశ్వసనీయమైన మూలాల ద్వారానే వాటిని నిర్ధారించుకోవాలని సూచించారు. విశ్వాసం లేకుండా దేనినీ విశ్వసించవద్దని పిలుపునిచ్చారు.
అయితే.. సోషల్ మీడియాలో కొంత క్రమశిక్షణ అవసరమని, కొత్త పద్ధతిలో మనల్ని మనం స్వయంగా ఓ క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. అయితే.. ఇది కేవలం జెన్ జెడ్ మాత్రమే కాదని, ఇతరులు కూడా ఈ క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు. అంతకంటే ముందు, సమాజంలో మనమందరం దానిని మనకు మనంగా ఆచరించి చూపాల్సి ఉంటుందన్నారు.ఆ తర్వాత, అటువంటి క్రమశిక్షణను అమలు చేస్తే అది ఫలిస్తుంది. లేకపోతే, ఏదైనా విషయాన్ని నిషేధిస్తే అది కేవలం అక్రమ మార్కెట్‌లోకి చేరి, మరింత బలంగా విస్తరిస్తుంది. అది పరిష్కారం కాదు. కాబట్టి, దీనికి పరిష్కారం కేవలం ప్రభుత్వం నుండే కాకుండా, సమాజం మొత్తం నుండే రావాలి అని అన్నారు.




