
వివాదాస్పద ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా కీలక అంశాలతో ఉన్న బిల్లును సీఎం పుష్కర్ సింగ్ ధామీ మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. సహ జీవనంలో పుట్టిన పిల్లలకు చట్టపరమైన గుర్తింపును కల్పించడంతోపాటు సహ జీవనాన్ని నమోదు చేసుకోకపోతే 6 నెలల జైలు శిక్ష వంటి అంశాలను ఈ బిల్లులో పొందుపరిచారు. ఈ బిల్లు ఆమోదం కోసమే 4 రోజులపాటు శాసనసభ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు. బిల్లు ఆమోదం పొందితే స్వాతంత్య్రం తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. అయితే పోర్చుగీస్ పాలనలో ఉన్నప్పటి నుంచి గోవాలో ఉమ్మడి పౌర స్మృతి అమల్లో ఉంది. ఇది అమల్లోకి వస్తే ఉత్తరాఖండ్‌లోని అన్ని మతాలకు ఒకే తరహా వివాహ, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ నిబంధనలు వర్తిస్తాయి. గిరిజనులను ఈ బిల్లు నుంచి మినహాయించారు.
సహజీవనాన్ని దాస్తే 6 నెలల జైలు
సహ జీవనం సాగించాలనుకుంటున్నవారు తప్పనిసరిగా రిజిస్టరు చేసుకోవాలని బిల్లులో పేర్కొన్నారు. 21ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువతీ యువకులు సహ జీవనం చేయాలనుకుంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. అయితే నైతికతకు విరుద్ధంగా ఉన్న సహ జీవనాలను రిజిస్టరు చేయరు. సహ జీవనం చేయాలనుకున్న ఇద్దరిలో ఒకరికి వివాహం జరిగినా, మైనర్ అయినా సహ జీవనం సంబంధాలను రిజిస్టర్ చేయబోరు. సహ జీవనం దరఖాస్తులో ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే రిజిస్ట్రార్ పోలీసు విచారణ కోరవచ్చని బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. సహ జీవనం గురించి తప్పుడు సమాచారం ఇస్తే 3 నెలల జైలు, రూ. 25 వేల జరిమానా విధిస్తారు. సహ జీవనాన్ని రిజిస్టరు చేయించకపోతే రూ.25 వేల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. సహజీవనంలో జన్మించిన పిల్లలకు చట్టబద్దమైన హక్కులు సంక్రమిస్తాయి.
ఇస్లాం పద్ధతులపై నిషేధం
ఈ బిల్లు ద్వారా బహు భార్యత్వం, బాల్య వివాహాలపై పూర్తి నిషేధం అమల్లోకి వస్తుంది. అన్ని మతాల్లోని బాలికలకు ప్రామాణిక వివాహ వయస్సు, విడాకుల కోసం ఏకరీతి ప్రక్రియ వంటి ప్రతిపాదనలున్నాయి. విడాకులు, భర్త మరణం తర్వాత ఇస్లాం మహిళలు తప్పకుండా పాటించాల్సిన హలాలా వంటి పద్ధతులపై నిషేధాన్ని ఈ బిల్లులో చేర్చారు. అయితే మతాల వారీగా వివాహ సంప్రదాయాలను మాత్రం మార్చలేదు. సప్తపది, నిఖా, ఆనంద్ కరాజ్ వంటివి అమల్లో ఉంటాయి.





