News

భారత్‌కు అత్యాధునిక ఎంక్యూ9బీ డ్రోన్లు

269views

భారత్‌కు అత్యాధునిక సామర్థ్యాలున్న డ్రోన్లను అందజేయనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని దాని ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ విలేకర్లకు వెల్లడించారు. ‘‘మేం భారత్‌కు విక్రయించే డ్రోన్లలో అత్యాధునిక సముద్ర రక్షణ, నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఎంక్యూ9బీ (MQ 9B)ల విక్రయాలు ఉపయోగపడతాయి’’ అని పేర్కొన్నారు. భారత్‌-అమెరికా మధ్య ఇండో-పసిఫిక్‌ బంధం మరింత బలపడనుందని ఈ వ్యాఖ్యలు చెబుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత్‌కు 31 సాయుధ ఎంక్యూ9బీ డ్రోన్ల విక్రయానికి గత వారం అమెరికాలోని బైడెన్‌ సర్కారు ఆమోదముద్రవేసి దేశ కాంగ్రెస్‌కు నోటిఫై చేసింది. ఈ డీల్‌ కింద సముద్రంపై విధులు నిర్వహించే 15 సీగార్డియన్‌ డ్రోన్లు, పదాతి దళం, వాయుసేన కోసం 16 స్కై గార్డియన్‌లను భారత్‌ దాదాపు 4 బిలియన్‌ డాలర్ల వెచ్చించి కొనుగోలు చేయనుంది. కాంగ్రెస్‌ ఆమోదముద్ర పడితే మరికొన్ని నెలల్లోనే ధరలపై చర్చలు కొలిక్కి వచ్చి డెలివరీలు మొదలయ్యే అవకాశం ఉంది.

2023లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా తొలిసారి ఈ డీల్‌పై ప్రకటన వెలువడింది. భారత్‌ ఇప్పటికే రెండు సీగార్డియన్‌ డ్రోన్లను అమెరికా నుంచి లీజుకు తీసుకొని వాడుతోంది. ఆ డ్రోన్ల వల్ల భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతమైంది. సముద్ర మార్గాల్లో గస్తీ, నిఘా మెరుగుపడుతుంది. వాస్తవానికి ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూపై హత్యాయత్నం ఘటన కారణంగా ఈ డీల్‌లో జాప్యం జరుగుతుందనే ప్రచారం మొదలైంది. కానీ, అదే సమయంలో అమెరికా వైపు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడం విశేషం.