
జ్ఞానవాపి మసీదు ప్రాంగణం సెల్లార్‌లోని వ్యాస్‌జీ మందిరం తలుపులు 31 ఏళ్ల తర్వాత బుధవారం రాత్రి తెరచుకున్నాయి. అక్కడున్న లక్ష్మీదేవి, గణేశుడి ప్రతిమలకు హారతి, అర్చన నిర్వహించినట్లు కాశీ విశ్వనాథ ఆలయం ట్రస్టు అధ్యక్షుడు నాగేంద్ర పాండే తెలిపారు. దీని కోసం పూజారి కుటుంబానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య సీలువేసిన సెల్లార్ మార్గాన్ని తెరిచారు. రాత్రి 9.30 గంటల సమయంలో మందిరాన్ని శుభ్రం చేశారని, 10.30కి హారతి ఇచ్చారని అధికారులు తెలిపారు. అంతకుముందు మసీదు ప్రాంగణంలోని వజూఖానాకు ఎదురుగా ఉన్న నంది విగ్రహం చెంతనున్న బారికేడ్లను జిల్లా యంత్రాంగం తొలగించింది.
అయితే, సెల్లార్‌లో పూజలకు వారం రోజుల్లో ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను వారణాసి కోర్టు ఆదేశించగా… గంటల వ్యవధిలోనే హడావుడిగా తలుపులు తెరవాల్సిన అవసరం ఏమిటని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. మసీదులో శుక్రవారం ప్రార్థనలకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.





