News

అలీగఢ్‌ వర్సిటీకి మైనారిటీ హోదాపై తీర్పు రిజర్వు

355views

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)కి మైనారిటీ హోదా పునరుద్ధరణపై రోజుల తరబడి జరిగిన వాడీవేడి చర్చల అనంతరం గురువారం సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది. ఎనిమిది రోజులపాటు ప్రత్యర్థి వర్గాల వాదనలు విన్న సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారథ్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును రిజర్వు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ మిగతా సభ్యులుగా ఉన్నారు. ఏఎంయూకు మైనారిటీ హోదా అంశం కొన్ని దశాబ్దాలుగా చట్టపరమైన చిక్కుల్లో నలుగుతోంది. ఈ కేసు విచారణను ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు 2019లో ఆదేశాలు జారీ చేసింది.

ఏఎంయూ కేంద్రీయ విశ్వవిద్యాలయం కాబట్టి, మైనారిటీ సంస్థగా పరిగణించలేమని అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 1967 నాటి ఎస్‌.అజీజ్‌ బాషా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో స్పష్టం చేసింది. అయినప్పటికీ 1981లో పార్లమెంటు ఆమోదించిన సవరణ చట్టంతో మైనారిటీ హోదా పొందింది. 2006లో అలహాబాద్‌ హైకోర్టు ఈ నిబంధనను కొట్టివేసింది. దీనిపై అప్పటి యూపీఏ సర్కారు అప్పీలుకు వెళ్లింది. యూనివర్సిటీ కూడా ప్రత్యేక పిటిషను దాఖలు చేసింది. యూపీఏ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును ఉపసంహరించుకుంటామని ఎన్డీయే సర్కారు 2016లో సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ప్రభుత్వ నిధులు పొందుతున్న ఏఎంయూ మైనారిటీ సంస్థ కాదన్న కేంద్ర ప్రభుత్వం 1967 నాటి సుప్రీం తీర్పును ఉటంకించింది.