పూర్వం ఎలాంటి సౌకర్యాలూ లేని రోజుల్లో కూడా పుణ్యక్షేత్రాలకు బయల్దేరేవారు. యాత్రలకు వెళ్లడం వల్ల నిత్య జీవితంలో ఉండే అలసట తగ్గి కొత్త ఉత్సాహం వచ్చి చేరుతుంది. ఎందరినో కలవడం,
ఎన్నో చూడటం వల్ల వినోదం, విజ్ఞానం పెంపొందుతాయి. పుణ్యం, పురుషార్థం కూడా.
జ్ఞానం ఉంటేనే ముక్తి సాధ్యమవుతుంది. ముక్తి లభించే మార్గంలో జీవితాన్ని సాగించిన వాడే పాత్రుడు. అంటే అర్హుడు. ఈ అర్హత జ్ఞానార్జన సంబంధమైనదే. అందుకే మనం జ్ఞానులు, సాధువులను ఆశ్రయించాలి. మహిమాన్విత తీర్థాలు, క్షేత్రాలను దర్శనం చేసుకుని, ఆత్మ- పరమాత్మల అవగాహన పెంచుకోవాలి. ధర్మార్థ కామమోక్షాల ఆధారంగా ఈ జ్ఞానార్జన జరగాలి. కానీ తక్కినవాటిని విడిచి.. అర్థ, కామాల వెంట మాత్రమే మనిషి పరుగులు తీస్తున్నాడు. ఇలాంటి నడత మనిషిని జ్ఞానానికి దూరం చేస్తుంది. అందుకు భిన్నంగా భగవత్ సంబంధ జ్ఞానం మనలో సద్బుద్ధిని పెంచి, సన్మార్గంలో నడిపిస్తుంది. భవ బంధాల నుంచి విముక్తి కలిగిస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. దీని కోసం ఎన్నెన్నో మార్గాలను పెద్దలు సూచించారు. అలాంటి వాటిలో ఒకటి యాత్రలకు వెళ్లడం.
యాత్రలు తీర్థ పరంగా, క్షేత్ర పరంగా ఉన్నాయి. అలాంటి వాటిలో ముందుగా తలచుకోవలసినవి సప్త మోక్ష నగరాలు. ఇవి విలసిల్లింది మోక్షం సిద్ధింప చేసేందుకే. యుగయుగాలుగా ఆ లక్ష్యంతోనే మనవాళ్లు భక్తిశ్రద్ధలతో యాత్రలు చేస్తున్నారు. భారతావనిలో ముక్తి ప్రసాదించేందుకు ఉన్న సప్త నగరాల్లో పరమాత్మ అనేకానేక అవతారాలుగా ఉద్భవించి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసిన సందర్భాలు, సంఘటనలు.. అన్నీ మానవాళికి ముక్తి మార్గ ప్రబోధాలే. అయోధ్య, మధుర, గయ, కాశీ, కంచి, అవంతికాపురి, ద్వారక- అనే ఏడింటిని మోక్ష నగరాలుగా గరుడ పురాణం పేర్కొంది. మోక్షం కోరుకునే వారు ఈ నగరాలను సందర్శించాలని పురాణాలూ, ఇతిహాసాలూ సూచిస్తున్నాయి. ధర్మబద్ధంగా జీవిస్తూ, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ, ముక్తి కోసం ప్రయత్నించడమే ధ్యేయంగా చేసుకోవాలన్నది దీని వెనుక ఉన్న పరమార్థం.
మన పురాణాలు, ఇతిహాసాల్లో తీర్థయాత్రలు చేస్తూ జీవితాన్ని మోక్ష ప్రాప్తి దిశగా సాగించిన వారు చాలామందే కనిపిస్తారు. రామాయణ కథలో శ్రవణ కుమారుడు వృద్ధులైన తన తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ దారిలో కనిపించిన తీర్థాలను, క్షేత్రాలను చూపిస్తూ ముందుకు నడిచాడు. అలాగే మనుచరిత్రలో సిద్ధుడు కేదారేశుడిని, హింగులాంబికా దేవిని దర్శించినట్లు వివరణ ఉంది. ఇలా తీర్థయాత్రలతో ముక్తిని పొందిన ఎందరి గురించో మన పురాణేతిహాసాలు పేర్కొంటున్నాయి.
సామాజిక న్యాయం
తీర్థయాత్రల వెనుక ఓ సామాజిక న్యాయం ఉంది. ‘యాత్రకు వెళ్లినప్పుడు పాత్ర కొనాలి’ అనే నానుడిని బట్టి యాత్రల వల్ల ఆయా ప్రాంతాల్లో స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యం కనిపిస్తుంది. అలాగే స్థల పురాణ కథలను అనుసరించి తీర్థక్షేత్రాల్లో దానధర్మాలు విరివిగా చేసేవారు. వాటిని అందుకునేందుకు నిస్సహాయులెందరో వేచి ఉండేవారు. అలాగే యాత్రికులిచ్చే ధనంతో చేతివృత్తులవారు లబ్ధి పొందేవారు. వచ్చీపోయేవారి వల్ల అనేకమందికి ఉపాధి లభించేది.
పుణ్యం.. పురుషార్థం..
ఆధ్యాత్మిక చింతన పెంచే మన పుణ్యక్షేత్రాలు, తీర్థాలు భారతీయ సంస్కృతికి ప్రతిరూపాలు. యాత్రల ద్వారా పుణ్యం సంపాదించుకోమని చెప్పే అంశానికి ప్రాధాన్యం ఉంది. దీన్ని అనుసరించే పుణ్యం పురుషార్థం రెండూ సమకూరుతాయనే మాట వచ్చింది. పుణ్యమంటే పరలోక సంబంధమైంది మాత్రమే కాదు. లోకజ్ఞానం కూడా పుణ్యఫలంతోనే వస్తుంది. ఒక పుణ్య క్షేత్రాన్ని దర్శించుకుంటే.. అక్కడి అధిదేవత ప్రసాదించే వరాలు పొందడమే కాకుండా, ఆ ప్రాంత ఆర్థిక, సామాజిక పరిస్థితులు, చుట్టుపక్కల విశేషాలు యాత్రికులకు తెలుస్తాయి. ఈ కోణంలో చూస్తే మన సంస్కృతి యాత్రలను ప్రోత్సహిస్తూ, సామాజిక సంక్షేమాన్ని కూడా వృద్ధి చేస్తుందని స్పష్టమవుతుంది.
పయనం.. ఆనందదాయకం..
మనలో జ్ఞానాన్ని, విజ్ఞతను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని.. అన్నిటినీ పెంచిపోషిస్తూ.. పాత్రులైన వ్యక్తులుగా తీర్చిదిద్దటమే యాత్రల లక్ష్యం. అందుకే ‘దేశమైనా చూడాలి.. కోశమైనా చూడాలి’ అనే సామెత ఆవిర్భవించింది. కోశం అంటే నిఘంటువు. నిఘంటువులను పరిశీలిస్తుంటే ఎంత భాషాజ్ఞానం పెరుగుతుందో వివిధ ప్రాంతాలు తిరిగొస్తే అంత లోకజ్ఞానం పెరుగుతుందన్న పెద్దల జీవితానుభవమే ఈ సామెత సారాంశం. అందుకే పూర్వీకులు వీలైనప్పుడల్లా యాత్రలు చేసేవారు. వెళ్లగలిగే వెసులుబాటు లేదనుకుంటే యాత్ర చేసొచ్చిన వారిని అడిగి విశేషాలు తెలుసుకునేవారు. తీర్థ, క్షేత్రాలను దర్శించడమే కాదు.. చదవడం, వినడం, చెప్పడం వల్ల కూడా పుణ్యం ప్రాప్తిస్తుంది అంటారు. ఆయా ప్రదేశాల మహిమలు, విశేషాల గురించి ఎక్కువమంది తెలుసుకోవాలి అన్నదే దీని ఆంతర్యం.
దర్శనీయ స్థలాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, పంచారామాలు, పంచభూత క్షేత్రాలు, స్వయంభూ దేవాలయాలు ఇలా అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఏ విధంగా పరిశుద్ధ జీవనం సాగించాలి, ఎలా దైవానుగ్రహం పొందాలనే విషయాలను తెలియజేస్తుంటాయి. యాత్రలకు వెళ్లే అవకాశం లేనప్పుడు విని తెలుసుకుంటూ స్వయంగా చూసొచ్చిన అనుభూతి పొందుతుంటారు- అనేదానికి మనుచరిత్రలో ప్రవరుడి కథే ఓ ఉదాహరణ. అతడి దగ్గరికి సిద్ధుడు వచ్చినప్పుడు ఆతిథ్యమిచ్చి.. ‘ఏయే ప్రదేశాలకు వెళ్లారు? ఏయే పర్వతాలు చూశారు? ఏయే తీర్థములు, ఏయే ద్వీపములు, ఏయే వనాలు, నదులు చూశారు? ఆ విశేషాలు, వింతల గురించి నాకు తెలియజేయండి మహాత్మా’ అనడిగాడు.
అప్పుడు సిద్ధుడు ‘ఈ దేశం, ఆ దేశం అని అనడమెందుకు? అవకాశం ఉన్న ప్రాంతాలన్నీ దర్శించుకున్నాను’ అంటాడు. సిద్ధులంటే జ్ఞానార్జనపరులు. అలాంటి వారు యాత్రలు చెయ్యాలి, చేస్తారు- అని సిద్ధుడి మాటల వల్ల తెలుస్తుంది. ఆ సిద్ధుడి దగ్గర పసరు తీసుకుని.. తాను ఎప్పటి నుంచో చూడాలనుకున్న హిమాలయ ప్రాంత సౌందర్యాలన్నిటినీ చూసి ఆనందిస్తాడు ప్రవరుడు. అప్పుడు పెద్దన వర్ణించిన ‘అటజని కాంచె..’ పద్యం ఒక చక్కని యాత్రాదర్శిని లాంటిది. హిమాలయ పర్వత విశేషాలను గంగానదీ సోయగాలతో కలిపి చూపిస్తుందీ పద్యం. అలాగే రామాయణంలో వాలి తరుముతూ వెళ్లినప్పుడు.. సుగ్రీవుడు పరుగెత్తుతూ భూమండలంలో ఎన్నెన్ని విశేష ప్రదేశాలున్నాయో చూస్తాడు. వాటిని గుర్తు పెట్టుకుని వానరులను సీతాన్వేషణకు పంపేటప్పుడు వివరించి చెబుతాడు. ఆ వర్ణనలు, ఆయా రాజ్యాల కట్టడాలు, ప్రాంత విశేషాలు, ప్రకృతి దృశ్యాలు కళ్ల ముందు మెదులుతున్నట్టే అనిపిస్తుంది. భారతంలో బలరాముడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు తీర్థ యాత్రలకు బయల్దేరతాడు. అప్పటి వర్ణనలన్నీ ఆయా యాత్రాస్థలాల సౌందర్యాలు, విశేషాలను వర్ణిస్తాయి. చార్‌ధాం, కాశీ, గయ తదితర యాత్రల సారం పుణ్యాన్ని, జ్ఞానాన్ని కూడా సంపాదించుకోమనే.
-యల్లాప్రగడ మల్లికార్జున రావు