
పోకూరి కాశీపతి (1893-1974)
పల్నాడు జిల్లాలో చారిత్రక పట్టణం మాచర్ల. విద్యార్థి దశలో 1960ల్లో లక్షిందేవి మిద్దెల పక్కన లైబ్రరీ నుంచి గడియారం స్తంభం పక్కన కాశీపతి గారి ఇంటికి వెళ్ళేవాడిని. వారి కుమారుడు నా క్లాస్ పున్నా కృష్ణమూర్తి మేట్ చంద్రమౌళిని కలుపు కొని బడికి వెళదామని! కాశీపతి స్వర్ణ కంకణం, గండపెండేరం ధరించి తన సహజమైన ఆహా ర్యంతో వరండాలో కుర్చీపై కూర్చుని ఉండేవారు. ఆయన తెలుగు భాషకు వెన్నెముక అని తెలియదు. ఒకరోజు లక్షిందేవి చెరువు దగ్గర ఒక కారు, ఒక జీపు ఆగి ఉన్నవని, జీపు నుంచి పల్లకీ తీసి బోయీలు మోసుకుంటూ, మేళతాళాలు ముందు రాగా ఊర్లోకి వస్తున్నారని ఉప్పందింది. ఆ పల్లకీ పోకూరి వారి ఇంటి ముందు ఆగింది. కాశీపతి గారికి సంప్రదాయ మర్యాదలు చేసిన పెద్దలు వారిని పల్లకీ ఎక్కించారు. ఊరి బయటకు వెళ్ళాక పల్లకి నుంచి సగౌరవం గా కారులో కూర్చో పెట్టారు. ఆ కారు గద్వాల సంస్థానం నుంచి వచ్చిందని విన్నాము.
నందన నామ వత్సరం (1892-93) మాఘ మాసం తొలి దశమి సూర్యోదయ వేళ మాచర్ల మండలం వెల్దుర్తి సమీపంలో బోడిలివీడు గ్రామంలో జన్మించానని పోకూరి కాశీపతి చెప్పుకున్నారు.రెంటచింతల పాదరీ బడిలో ఫస్ట్ ఫారం ఇంగ్లీష్ చదివాననీ, సిరిగిరి పాడులో పెద తండ్రి రంగోజు కోటయ్య ఆశుకవితా మెలకువలు తెలి పారనీ తన విశిష్ట రచన ‘కాశీపతి చమత్కృతి’లో తెలిపారు.
‘చిత్రకవి’ బిరుదాంకితుడైన కాశీపతి సంప్రదాయ తెలుగు కవిత్వంలో అనితరమైన ప్రక్రియ లలో సాహిత్యాన్ని సృజించారు. ఒక వస్తువు చూసే కోణాన్ని బట్టి పరిపరివిధాలుగా కన్పిస్తుంది.
అలాగే ఒక కావ్యం అర్థం చేసుకునే రీతిని బట్టి అనేక కావ్యాలుగా కన్పిస్తుంది. అష్ట దిగ్గజాలలో ఒకరైన పింగళి సూరన రామాయణ- మహాభారతంలోని కొన్ని ఘట్టాలను ‘రాఘవ పాండవీయం’ అనే ద్వ్యర్థి కావ్యం రాశారు. పోకూరి ద్వ్యర్థి- త్ర్యర్థి కావ్యాలు రాశారు. వారి రచన ‘సారంగధరీయం’లో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం- సారంగధర తారాశశాంకం ఇతివృత్తాలు మూడు కావ్యాలు మూడు పాయల జడ వలె ఆహ్లాద పరుస్తాయి. ఒక పద్యానికి 30 అర్థాలు వచ్చే ‘త్రిమ్ శదర’ రత్నావళి రచించారు. గంటకు వందలాది పద్యాలు ఆశువుగా చెప్పగలరని పేరొందిన పల్నాటి సోదరకవులకు ఆశుకవితలో కొనసాగింపు పోకూరి కాశీపతి. కొల్లాపూర్లో జరిగిన ఒక కవిత్వ సభలో గంటకు రెండు వందల పద్యాలు ఆశువుగా చెప్పారనీ, ఒక యతి తప్పిందని ఒక పండితుడు అధిక్షేపించిన నేపథ్యంలో ‘కవి సింహ’ బిరుదాంకితుడు సింహమువలె ప్రత్యుత్తర ఆశు కవితలతో జయజయ ధ్వానాలు అందుకున్నారనీ ప్రత్యక్ష సాక్షి శ్రీ రంగాపురం ఫోతేదార్ కేశవా చార్యులు పేర్కొన్నారు.
ప – ఫ – బ-భ వంటి అక్షరాలు లేకుండా పెదవులు కలవని అక్షరాలతో అచ్చ తెలుగు పదాలతో ‘నిర్వచన నిరోష్ట్య శుద్ధాంధ్ర హరిశ్చంద్రో పాఖ్యానం’ రచించి, గద్వాల సంస్థానాధిపతి రామభూపాలునికి 1921లో పోకూరి అంకితమిచ్చారు. గద్వాల సంస్థానం ఆస్థాన కవిగా నియమితులైనారు. తెలంగాణ-రాయలసీమ-ఆంధ్ర ప్రాంతాలలోనే కాకుండా కాశీ తదితర సంస్కృత పీఠాలలో సంస్కృత భాషలో తన ప్రతిభను ప్రదర్శించారు. ఎన్నో గజారోహణలు చేశారు. ఎన్నెన్నో గండపెండేరాలు తొడిగించుకున్నారు. గద్వాల సంస్థానం రద్దు అయిన తర్వాత (1948) ఏటా నామమాత్రపు పిలుపులు ఉండేవి. కాశీపతి ఆర్ధిక పరిస్థితి తెలుసుకుని అప్పటి రాష్ట్రపతి సర్వే పల్లి రాధాకృష్ణన్ ఢిల్లీకి పిలిపించుకుని గౌరవించి, గౌరవ భృతిని ఏర్పాటు చేశారు. పోకూరి అభి మానుల్లో ప్రముఖ కవులు జాషువా, తుమ్మల సీతారామమూర్తి, కరుణశ్రీ, ప్రసాదరాయ కుల పతి, సి. నారాయణరెడ్డి తదితర సమకాలీనులెందరో ఉన్నారు.
చెన్నైలో 1920 ప్రాంతంలో కాశీపతి అష్టావధానం చేశారు. ఆ అవధానంలో ఒక పృచ్ఛకులు తాపీ ధర్మారావు. వారు అశువుగా కాఫీపై ఒక దండకం చెప్పవలసిందిగా పోకూరి వారిని కోరారు. ‘శ్రీమన్మహాదేవీ … అంబ కాఫీ జగన్మో హినీ…’ అంటూ వారు చెప్పిన దండకం మద్రాస్ కాఫీ ప్రియులకు కొత్త రుచులను ఇచ్చింది. ఇటీవలి కాలంలో ఒక ప్రముఖ కవి తానే కాఫీ దండ కాన్ని తొలిసారిగా రాశాను అన్నారు. బహుశా పోకూరి కాశీపతి ఆశువుగా చెప్పడం వారి దృష్టికి వచ్చి ఉండదు. పోకూరి కాశీపతి ప్రయోగాలు ఆకాశంలో నక్షత్రాలైతే అందులో ఒక ఉదాహరణ. (నిర్వచన నిరోష్ట్య శుద్ధాంధ్ర హరిశ్చంద్రోపాఖ్యానం ఆశ్వా : 2. పద్యం 76) ఒకే అక్షరంతో రాసిన కందపద్యం.
నే నిన్నై నను నీన
న్నానా నే నాన నూననా నాన్నననౌ
నా నిన్ను నెన్న నన్నా
నా నేనున్నాన నానినా నన్నన్నా
ఈ తెలుగు ఉద్ధండ పండితుని 131 జయంతిని ఇటీవలే సాహితీ లోకం జరుపుకొన్నది.
– పున్నా కృష్ణమూర్తి
వ్యాసకర్త ఇండిపెండెంట్ జర్నలిస్టు : 76809 50863





