News

అయోధ్య గర్భగుడిలో పూజలకు శ్రీకారం

293views

అయోధ్యలో ఈ నెల 22న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగనుండగా.. ముందుగా శ్రీరాముని విగ్రహం కళ్లకు ఉన్న గంతలు విప్పి భగవంతుని దర్శనం చేసుకున్నాక మోదీ హారతి ఇవ్వనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్‌సంఘ్‌ చాలక్‌ మోహన్‌ భగవత్‌ ప్రధాని వెంట ఉంటారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్‌ దేవగిరి మహరాజ్‌ తెలిపారు. ప్రాణప్రతిష్ఠకు ముందుగా జనవరి 16 నుంచి ఆరు రోజులపాటు జరుగుతున్న పూజా కార్యక్రమాలను వ్యక్తిగత, భద్రతా కారణాల రీత్యా ప్రధాని మోదీ నిర్వహించలేరు కాబట్టి, ఆయనకు బదులుగా ట్రస్టు సభ్యుడు డాక్టర్‌ అనిల్‌ మిశ్ర దంపతులు అన్ని పూజల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. 121 మంది ఆచార్యులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం సరయూ నదీతీరంలో కలశపూజ చేశారు. అనంతరం సరయూ నీటిని కలశాల్లో రామమందిరానికి తీసుకువెళ్లారు. గర్భగుడిలో రాముడి విగ్రహం ప్రతిష్ఠించేచోట ట్రస్టు సభ్యులతోపాటు నిర్మోహీ అఖాడాకు చెందిన మహంత్‌ దినేంద్ర దాస్‌, పూజారి సునీల్‌దాస్‌ పూజలు చేసి హారతి ఇచ్చారు. గురువారం బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు.

ఏటా శ్రీరామనవమి నాడు గర్భగుడిలోని రామ్‌లల్లా నుదుటిపై ఆరు నిమిషాలపాటు ‘సూర్యతిలకం’ మెరిసేలా కటకాలు, అద్దాలను అమర్చారు. ఎస్‌.కె.పాణిగ్రాహి సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం ఈ ఏర్పాట్లు చేసింది.

మోదీయే ప్రధాన ‘కర్త’: లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌

అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన ‘కర్త’గా ఉంటారని ఆ క్రతువును నిర్వహించనున్న ప్రధాన పూజారి లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ బుధవారం తెలిపారు. ప్రధాన ఘట్టానికి ముందు పూజల క్రతువుల్లో పాల్గొంటున్న ట్రస్టు సభ్యుడు డాక్టర్‌ అనిల్‌ మిశ్ర దంపతులు పవిత్రోత్సవం రోజున కూడా ‘కర్త’(యజమాన్‌)గా ఉంటారన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. సాధారణంగా ప్రార్థనలు ఎవరి తరఫునైతే జరుగుతాయో, పూజలకు ఎవరైతే ఆతిథ్యం ఇస్తారో వారిని ‘యజమాన్‌’గా వ్యవహరిస్తారు. వారణాసి నుంచి అయోధ్యకు బయలుదేరుతూ లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ మీడియాతో మాట్లాడారు.