Articles

మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం సావిత్రిబాయి ఫూలే

281views

(జనవరి 3 – సావిత్రిబాయి పూలే జయంతి )

భారతదేశ చరిత్రలోనే సామాజిక విప్లవకారుడిగా ఘనతకెక్కిన జ్యోతిబా ఫూలే సతీమణే ‘‘సావిత్రిబాయి ఫూలే. భర్తకు తగ్గ భార్యగా సావిత్రి కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. భారతదేశంలో మహిళా విద్యకు పెద్దపీట వేస్తూ, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలు చదువుకొనేందుకు ఆమె పాఠశాలలు సైతం ప్రారంభించారు. ఆమె విప్లవ ప్రసంగాలు ఆనాటి మహిళల్లో ఎందరికో స్ఫూర్తిని కలిగించాయి.

సావిత్రి బాయి 1931 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగావ్ గ్రామంలో జన్మించారు. అప్పట్లో ఉన్న పరిస్థితుల ప్రకారం 9 ఏళ్లకే జ్యోతిరావ్ ఫూలేతో సావిత్రిబాయికి వివాహం జరిగింది. ఒక విధంగా వివాహం జరగడం సావిత్రిబాయి అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆమెను వివాహం చేసుకున్న జ్యోతిరావ్ ఫూలే ఒక గొప్ప సంఘ సంస్కర్త. ఆయన ప్రోత్సాహంతో అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైన సావిత్రి బాయి ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాలని సంకల్పించి అందుకు తగ్గ శిక్షణ పొంది 1848‌లో భర్త జ్యోతిరావ్ ఫూలేతో కలిసి బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు. అదే నాడు బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొట్టమొదటి పాఠశాల అయింది. అలా ఆమె భారతదేశంలో స్థాపించబడిన మొదటి మహిళా పాఠశాలకి అధ్యాపకురాలిగా చరిత్రపుటల్లో స్థానం సంపాదించుకున్నారు.

సమాజంలో చైతన్యం తేవాలంటే అన్ని విషయాలలో అవగాహనతో పాటు చక్కటి రచనా పటిమ మరియు అనర్గళంగా ఉపన్యసించే సామర్థ్యం ఉండాలి. ఆ లక్షణాలన్నీ సావిత్రి బాయిలో పుష్కలంగా ఉన్నాయి. తను రచించిన కవితలు మరియు చేసిన ఉపన్యాసాలన్నీ పుస్తక ప్రచురణకు నోచుకున్నాయి. గ్రామీణ మహిళల్లో చదవు వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన కలిగించి కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించిన మహా విద్య దానశీలి సావిత్రి బాయి. ఎన్ని అవమానాలు, బెదిరింపులు, దాడులు జరిగినను మొక్కవోని ధైర్యంతో బలమైన ఒకే సంకల్పంతో మొత్తం 52 పాఠశాలలను ఆమె తన జీవితకాలంలో నిర్వహించారు. అది నాటి సమాజంలో అతి పెద్ద సాహసమే అని చెప్పాలి.

మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి ‘‘మహిళా సేవా మండల్’’‌ను 1852లో సావిత్రి బాయి స్థాపించారు. ఒక సామాజిక అభ్యుదయవాదిగా ఎన్నో సమస్యలకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారత కోసం ఉద్యమించారు. వైధవ్యమంటే ఏమిటో కూడా తెలియని పసి వయసులో సమాజంలో విధవలుగా ముద్రపడిన ఎంతో మంది ఆడపిల్లలను అక్కున చేర్చుకొని వారి ఆలనా పాలనా చూసిన మహోన్నత మహిళా మూర్తి సావిత్రి. అంతేకాదు, వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా నిరసించి, ఆ క్షురకులను చైతన్య పర్చి, వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి. 1873లో తన భర్త మహత్మా ఫూలేతో కలసి ‘‘సత్య శోధక్ సమాజ్’’ను ప్రారంభించి బాల్య వివాహాలకు, మూఢ నమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా, వితంతువు పున:ర్వివాహాల కోసం పోరాడారు. 1870, 1890 దశకాల్లో దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు పూలే దంపతులు 2 వేల మంది అనాథ పిల్లలను అక్కున చేర్చుకున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించారు.

సావిత్రిబాయి ఫూలే, జ్యోతిరావ్ ఫూలే సంఘ సంస్కర్తలుగా పేరు తెచ్చుకున్నారు. అయితే 1890 నవంబర్ 28న జ్యోతిరావు ఫూలే అనారోగ్యంతో మరణించారు. కన్నీటిని దిగమింగుతూనే కొత్త సంస్కరణకు తెర తీశారు. తన భర్త ఫూలే చితికి తానే స్వయంగా నిప్పు పెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపి చరిత్రలో నిలిచారు. 1897లో పూణేలో ప్లేగు మహమ్మారి వ్యాపించడంతో వ్యాధిగ్రస్తులకు సావిత్రి బాయి సేవ చేస్తూ అదే ఏడాది మార్చ్ 10న ప్లేగు వ్యాధితోనే పరమపదించారు. ఆమె చేసిన సేవలకు గుర్తుగా 1997లో భారత ప్రభుత్వం సావిత్రబాయి జ్ఞాపకార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది. పూణే విశ్వవిద్యాలయానికి ఆమె పేరు పెట్టారు. క్రాంతిబాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రిబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటారు.